
రీ ఓపెన్ ఫిర్యాదులపై దృష్టి సారించాలి
నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో రీ ఓపెన్ అయిన ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆమె ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రీ ఓపెన్ దరఖాస్తులు 68 ఉన్నాయని వీటన్నింటినీ త్వరితగతిన పరిష్కరించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 1,641 దరఖాస్తులను పరిష్కారం చూపాలన్నారు. సీఎంఓ కార్యాలయం, వీఐపీ గ్రీవెన్స్‌కు సంబంధించి 15 పెండింగ్‌లో ఉన్నాయని వీటిని కూడా నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. పరిష్కరించిన ఫిర్యాదుల అర్జీదారుల అభిప్రాయ సేకరణ వేగవంతం చేసి వంద శాతం పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర యాప్‌లో పెండింగ్‌లో ఉన్న శాఖలు తక్షణమే సంబంధిత అంశాలను పూరించి ఫొటోలతో సహా అప్‌లోడ్ చేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సర్వేలలో భాగంగా పెండింగ్‌లో ఉన్న 451 మంది మిస్సింగ్ ఎంప్లాయిస్ డేటా, సిటిజన్ ఈ–కేవైసీ, వర్క్ ఫ్రం హోం డేటా ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెస్ నంబర్‌ను 40 శాతం మంది మాత్రమే మొబైల్ యాప్ వినియోగిస్తున్నారని ఇంటింటికి వెళ్లి మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరి చేత నంబర్ సేవ్ చేయించి హాయ్.. అని మెసేజ్ పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పశువుల దాహార్తి తీర్చేందుకు నిర్మించిన నీటి తొట్లలో ఎల్లప్పుడూ నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 290 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్‌కు అర్జీలు అందజేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ జాయింట్ కలెక్టర్ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ రాజకుమారి