
దర్యాప్తు సంస్థలకు అమిత్ షా సూచన
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికను వినియోగించుకుంటూ సైబర్ నేరాల కట్టడికి కృషి చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా దర్యాప్తు సంస్థలను కోరారు. ఆన్‌లైన్‌లో చిన్నారులు, మహిళలపై వేధింపులకు పాల్పడటం, తప్పుడు వార్తలను ప్రచారం చేయడం, మాయమాటలతో జనం కష్టార్జితాన్ని దోచుకునే నేరగాళ్లను ఏఐ ద్వారా గుర్తించొచ్చని మంత్రి తెలిపారు. ప్రపంచ డిజిటల్ లావాదేవీల్లో దాదాపు సగం, 46 శాతం వరకు భారత్ వాటా ఉందని, ఇలాంటి సమయంలో నేరాలను నివారించడం అత్యంత కీలకమని అన్నారు.
అయితే, దర్యాప్తు విభాగాలకు ఇది పెద్ద సవాల్‌తో కూడుకున్న వ్యవహారమని చెప్పారు. మంగళవారం ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) మొట్టమొదటి వ్యవస్థాపక దినోత్సవంలో మంత్రి అమిత్ షా కీలకోపన్యాసం చేశారు. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో 2018లో ఐ4సీ ఏర్పాటైంది. సైబర్ నేరాల కట్టడికి జాతీయ స్థాయిలో సమన్వయ కేంద్రంగా ఐ4సీ పనిచేస్తుంది. ఈ సందర్భంగా సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్(సీఎఫ్‌ఎంసీ), సమన్వయ వేదిక, సైబర్ కమాండోస్ ప్రోగ్రాం, సస్పెక్ట్ రిజిస్ట్రీ అనే నాలుగు విభాగాలను ఐ4సీలో అమిత్ షా ప్రారంభించారు.సైబర్ నేరాలపై సమర్థవంత పోరాటం కోసం పాతకాలపు ‘అవసరమైన విషయం మాత్రమే చెప్పడం’అనే పద్ధతిని విడనాడి, ‘బాధ్యతలను పంచుకోవడం’అనే విధానాన్ని అనుసరించాలని సూచించారు.