
చైనా హాఫ్ మారథాన్‌లో సత్తా చాటిన హ్యుమనాయిడ్ రోబోలు
21 కి.మీ.ల పరుగుపందెంలో అలరించిన రోబోలు
పురుషులతో పోటీగా దూసుకెళ్లిన వైనం
బీజింగ్‌లో విజయవంతమైన రేస్ కార్యక్రమం
మనిషికి దీటుగా కృత్రిమ మేధ ఆన్‌లైన్‌లో అసాధారణ ప్రతిభ చూపిస్తుంటే ఆఫ్‌లైన్‌లో అంటే ప్రత్యక్షంగా హ్యూమనాయిడ్ రోబోలు మనిషికి సవాల్ విసురుతున్నాయి. అనుకున్నదే తడవుగా పరుగుపందెంలో పోటీకి దిగి తమ సామర్థ్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశాయి. కృత్రిమ మేధ సాంకేతికతలో అధునాతన ఆవిష్కరణలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే 21 హ్యూమనాయిడ్ రోబోలు 21 కిలోమీటర్ల పరుగుపందెంలో మనుషులతో పోటీగా పరిగెత్తి శెభాష్ అనిపించుకున్నాయి. మానవులతో సమానంగా పరుగుకు ప్రయత్నించడంతో ప్రపంచంలోనే తొలి హ్యూమనాయిడ్ రోబో హాఫ్ మారథాన్‌గా ఈ కార్యక్రమం చరిత్రకెక్కింది.
చైనాలోని బీజింగ్ నగరంలో శనివారం ఈ రోబోలు చేసిన హడావుడి అంతాఇంతా కాదు. మనిషి సృష్టించిన మరమనిషి.. మనిషితోనే పోటీకి సై అనడం చూసేందుకు జనం తండోపతండాలుగా విచ్చేశారు. వాటితో కలిపి సెలీ్ఫలు, వీడియోలు తీసుకున్నారు. ట్రాక్‌పై పరుగెడుతున్న రోబోలను ఉత్సాహపరుస్తూ జనం విజిల్స్ వేస్తూ చప్పట్లు కొట్టారు. అమెరికా రోబోటిక్స్ కంపెనీలతో పోటీపడుతూ హ్యూమనాయిడ్ రోబోల రంగంలో ఆధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తున్న తరుణంలో దేశ రాజధాని బీజింగ్‌లో ఇజువాంగ్ హాఫ్ మారథాన్‌ను నిర్వహించడం గమనార్హం.
ఫార్ములా 1 తరహాలో..
ఫార్ములా 1 కార్ల రేసులో మార్గమధ్యంలో కార్ల టైర్లు పాడైతే వెంటనే ట్రాక్ పక్కనే హఠాత్తుగా ఆపేస్తారు. అక్కడున్న సిబ్బంది సెకన్ల వ్యవధిలో టైర్లు మార్చేసి వెంటనే రేస్‌ను కొనసాగించడానికి సాయపడతారు. శనివారం రోబోట్ల హాఫ్ మారథాన్‌లోనూ ఇదే నియమం పాటించారు. వేగంగా పరుగెత్తే రోబోల బ్యాటరీలు పాడైనా, చార్జింగ్ అయిపోయినా నిట్టనిలువుగా అక్కడే ఆగిపోకుండా పక్కనే స్టాప్‌పాయింట్లను సిద్ధంచేశారు. అక్కడ వెంటనే బ్యాటరీలను మార్చుకుని రోబోలు పరుగు కొనసాగించాయి. ఒకదానితో మరోటి ఢీకొనకుండా ఉండేందుకు మొదట్లోనే వీటిని సమాంతరంగా 1–2 మీటర్ల దూరంలో నిలబెట్టి పోటీని ప్రారంభించారు.
ఎన్నెన్నో సైజులు, ఆకారాలు
బీజింగ్ ఎకనామిక్–టెక్నలాజికల్ డెవలప్‌మెంట్ ఏరియాలో జరిగిన ఈ రేసులో ఒకే డిజైన్‌తో కాకుండా భిన్న పరిమాణాల్లో వేర్వేరు ఆకారాల్లో ఉన్న హ్యూమనాయిడ్ రోబోలు పాల్గొన్నాయి. మారథాన్ పూర్తయ్యాక ఆయా రోబోట్ల తయారీ కంపెనీలు, విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించేందుకు నిర్వాహకులు పలు విభాగాల కింద అవార్డులు అందజేశారు. ‘అత్యంత పోటీతత్వం’, ‘గొప్ప డిజైన్’, ‘అత్యంత వినూత్న తరహా రోబో’ఇలా పలు అవార్డ్‌లు ప్రదానం చేశారు.
2 గంటల 40 నిమిషాల్లో ఫినిషింగ్ లైన్‌కు..
ఈ పోటీలో చైనాలోని పలు ప్రముఖ హ్యూమనాయిడ్ రోబో కంపెనీలు, విశ్వవిద్యాలయాలు పోటీపడ్డాయి. తమ అధునాతన రోబోలను రంగంలోకి దింపాయి. ప్రతి రోబోకి ఒక రిమోట్ ఆపరేటర్, ఒక సహాయకుడు వెంటే పరుగెత్తారు. బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్న రోబోట్ ఇన్నోవేషన్ సెంటర్ వారి ‘తియాన్‌గాంగ్ అల్ట్రా’రోబో వేగంగా దూసుకొచ్చి విజేతగా నిలిచింది. 21 కిలోమీటర్ల పరుగుపందాన్ని కేవలం 2 గంటల 40 నిమిషాల్లో పూర్తిచేసి ఔరా అనిపించింది. ‘‘మనిషిలాగా ఈ రోబోకు పొడవైన కాళ్లను అమర్చాం.
మనిషిలా ఒక పద్ధతిగా పరుగెత్తేలా ప్రత్యేక అల్గారిథమ్‌ను ఇందులో సెట్‌చేశాం. అందుకే గెలుపు సాధ్యమైంది’’అని దీని తయారీసంస్థ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్ చీఫ్ టెక్నాలజీ అధికారి టాంగ్ జియాన్ చెప్పారు. హాఫ్ మారథాన్‌లో పురుషుల విభాగంలో 12,000 మంది పాల్గొనగా ఇథియోపియాకు చెందిన ఎలియాస్ దెస్తా అందరికంటే వేగంగా ఒక గంట రెండు నిమిషాల్లో మారథాన్‌ను పూర్తిచేసి విజేతగా నిలిచాడు. ఫిబ్రవరినెలలో హాఫ్ మారథాన్‌లో ప్రపంచ పరుగువీరుడు, ఉగాండా అథ్లెట్ జాకబ్ కిప్లిమో ఇదే 21 కి.మీ.ల హాఫ్ మారథాన్‌ను కేవలం 56 నిమిషాల్లో పూర్తిచేయడం తెల్సిందే.
ఇక్కడ పరుగు ముఖ్యం కాదు..!
‘‘ఇక్కడ కేవలం సరళరేఖ మార్గంలో పరుగు పందెం ముఖ్యం కాదు. అంతకుమించినవి ఎన్నో ఉన్నాయి. రోబోలు వేగంగా పరుగెత్తేటప్పుడు కూడా స్థిరంగా ఉండగల్గడం, ట్రాక్‌పై మలుపుల వద్ద తూలిపడిపోకుండా చూసుకోవడం, ట్రాక్‌పై జారిపోయే స్వభావం ఉన్న చోట జాగ్రత్తగా పరుగెత్తడం, ఎత్తుపల్లాలున్న చోట్ల వేగాన్ని అందుకు తగ్గట్లు మార్చుకోవడం వంటివన్నీ కీలకం. ఎంత వేగంతో వెళ్తే ఎంత బ్యాటరీ అయిపోతుంది?. గజిబిజి పరుగులో రోబో భాగాలు వదులుకాకుండా చూసుకోవడం వంటివన్నీ ముఖ్యమే’’అని బీజింగ్ హ్యూమనాయిడ్ రోబోట్ ఇన్నోవేషన్ సెంటర్ సీఈఓ జియాంగ్ యూజువాన్ చెప్పారు.
చైనాలో హ్యూమనాయిడ్ రోబోల మార్కెట్ మరో ఐదేళ్లలో ఏకంగా 119 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుందని ఓ అంచనా. ‘‘రోబోల మారథాన్ ఇక్కడితో ముగిసినా హ్యూమన్ టెక్నలాజికల్ అభివృద్ధి శకం ఇక్కడితోనే మొదలుకానుందనే చెప్పాలి. నేటి స్ఫూర్తితో మరిన్ని సంస్థలు ఈ రంగంలో ముందుకొస్తాయి. భవిష్యత్ హ్యూమనాయిడ్ శకానికి ఇది నాంది’’అని ఇజువాంగ్ స్థానిక యంత్రాంగం కమిటీ డిప్యూటీ డైరెక్టర్ లియాంగ్ లెయాంగ్ వ్యాఖ్యానించారు.
– బీజింగ్