
ఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై బీజేపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై బీజేపీ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ సీరియస్‌గా దృష్టి సారించింది. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించి.. ఇలాంటి వ్యాఖ్యలను బీజేపీ తిరస్కరిస్తుంది అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో జేపీ నడ్డా ట్విట్టర్ వేదికగా..‘భారత న్యాయవ్యవస్థ, భారత ప్రధాన న్యాయమూర్తిపై ఎంపీలు నిషికాంత్ దూబే, దినేష్ శర్మ చేసిన వ్యాఖ్యలతో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు. ఇది వారి వ్యక్తిగత వ్యాఖ్యలు. వారితో బీజేపీ ఏకీభవించదు. అలాంటి వ్యాఖ్యలకు ఎప్పుడూ మద్దతు ఇవ్వదు. బీజేపీ వాటిని పూర్తిగా తిరస్కరిస్తుంది. సుప్రీంకోర్టుతో సహా అన్ని కోర్టులు మన ప్రజాస్వామ్యంలో విడదీయరాని భాగమని బీజేపీ ఎల్లప్పుడూ న్యాయవ్యవస్థను గౌరవిస్తుంది. కోర్టుల సూచనలు, ఆదేశాలను సంతోషంగా అంగీకరించింది’ అని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. వక్ఫ్ సవరణ చట్టం, బిల్లులపై రాష్ట్రపతికి గడువు విషయంలో ఇప్పటికే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ చేసిన వ్యాఖ్యలపై వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఇంతలోనే మరో బీజేపీ నేత, లోక్‌సభ సభ్యుడు నిశికాంత్ దూబే సర్వోన్నత న్యాయస్థానంపై చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి.

भाजपा सांसद निशिकांत दुबे और दिनेश शर्मा का न्यायपालिका एवं देश के चीफ जस्टिस पर दिए गए बयान से भारतीय जनता पार्टी का कोई लेना–देना नहीं है। यह इनका व्यक्तिगत बयान है, लेकिन भाजपा ऐसे बयानों से न तो कोई इत्तेफाक रखती है और न ही कभी भी ऐसे बयानों का समर्थन करती है। भाजपा इन बयान…
— Jagat Prakash Nadda (@JPNadda) April 19, 2025
సుప్రీంకోర్టే చట్టాలు చేస్తే ఇక పార్లమెంటు భవనాన్ని మూసుకోవాల్సిందే అంటూ నిశికాంత్ దూబే వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్టులు పెట్టారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటు శాసనాధికారాల్లోకి న్యాయస్థానాలు చొరబడుతున్నాయని, చట్టసభ్యులు చేసిన చట్టాలను కొట్టివేస్తున్నాయని విమర్శించారు. జడ్జీలను నియమించే అధికారం ఉన్న రాష్ట్రపతికే సుప్రీంకోర్టు ఆదేశాలిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో అధికరణం 368 ప్రకారం చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉందన్నారు. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వగలదని, పార్లమెంటుకు మాత్రం కాదని తెలిపారు. పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ (సవరణ) బిల్లు రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తున్న నేపథ్యంలో ఆయన ఇలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.