
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు, పార్లమెంట్ కంటే రాజ్యాంగమే సర్వోన్నతమైనదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్ అన్నారు. ఓ లీగల్ వెబ్‌సైట్ ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. ‘‘పార్లమెంటు చట్టాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయా, ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయా అనే తనిఖీ బాధ్యతను రాజ్యాంగం న్యాయ వ్యవస్థకు అప్పగించింది.
జాతీయ న్యాయ నియామకాల కమిషన్ వల్ల న్యాయవ్యవస్థకు స్వతంత్రత పోతుందనే భావనతో దాన్ని రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు ప్రకటించారని భావించరాదు’’ అని చెప్పారు. నిర్దిష్ట చట్టం, లేదా రాజ్యాంగ సవరణ రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘిన్నాయా, లేదా అనేది న్యాయ వ్యవస్థ నిర్ణయించాలని జస్టిస్ లోకూర్ అభిప్రాయపడ్డారు. వ్యవస్థలన్నింటిలోనూ పార్లమెంటే అత్యున్నతమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో జస్టిస్ లోకూర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.