
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్‌రాష్ట్ర నదీజలాల చట్టం–1956లోని సెక్షన్ 3 ప్రకారం కృష్ణాజలాల పునఃపంపిణీ కోసం కేంద్రం జారీచేసిన నూతన మార్గదర్శకాల వల్ల ఏపీకి తీరని నష్టం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. గతంలోని కేటాయింపులు కాకుండా ఇప్పుడు మళ్లీ కేటాయింపులను మొదటి నుంచి పరిశీలించేలా విధివిధానాలను ఖరారు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతుందని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్‌సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం దృష్టికి ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లింది.
కృష్ణాజలాల పంపిణీకి సంబంధించి ట్రైబ్యునల్‌కు కేంద్రం జారీచేసిన సెక్షన్ 3ను రద్దుచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. నదీజలాల కేటాయింపు విషయంలో గతేడాది తీసుకున్న కేంద్ర నిర్ణయం ఆమోదయోగ్యం కాదని, నదీజల వివాద చట్టం ప్రకారం బ్రిజేష్ ట్రైబ్యునల్‌కు ఇలా అదనపు అంశాలు పరిశీలించే అధికారం లేదని ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, జైదీప్ గుప్తా వాదనలు వినిపించారు.
గతంలో కృష్ణానది జలాల పంపిణీలో భాగంగా ఏపీకి 811 టీఎంసీలు కేటాయించగా.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారని తెలిపారు. అయితే ఈ కేటాయింపులను మళ్లీ మొదటి నుంచి పరిశీలించేలా విధివిధానాలు ఖరారు చేయడం వల్ల ఏపీకి తీవ్ర అన్యాయం జరిగే అవకాశముందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం కోర్టు సమయం ముగియడంతో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తదుపరి వాదనలు గురువారం లేదా మరోరోజు వింటామని ధర్మాసనం తెలిపింది.