
స్థానిక అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వలేదు
అఖిలపక్ష సమావేశంలో అంగీకరించిన కేంద్రం
సెక్యూరిటీ ప్రొటోకాల్స్ వైఫల్యంపై ప్రశ్నించిన పార్టీలు
ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేయాల్సిందేనని స్పష్టీకరణ
ఉగ్రవాదంపై పోరులో ప్రభుత్వానికి అండగా ఉంటామని వెల్లడి
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాద దాడికి భద్రతాపరమైన లోపాలే కారణమని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. బైసారన్‌లోకి పర్యాటకులను అనుమతిస్తున్నట్లు స్థానిక అధికారులు భద్రతా దళాలకు ముందస్తుగా సమాచారం ఇవ్వాల్సి ఉండగా అలా జరగలేదని పేర్కొంది. సాధారణంగా జూన్‌లో అమర్‌నాథ్ యాత్ర జరిగేదాకా బైసారన్‌లో పర్యాటకుల రాకపోకలపై ఆంక్షలు విధిస్తుంటారు. ఈసారి మాత్రం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే యాత్రికులను అనుమతించారని కేంద్రం వెల్లడించింది.
పహల్గాం దాడి నేపథ్యంలో గురువారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. బీజేపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీల ముఖ్యనేతలు హాజరయ్యారు. ఉగ్ర దాడి బాధితులకు తొలుత సంతాపం ప్రకటించారు. దాడి, తదనంతర పరిణామాలపై చర్చించారు. దాడిని నేతలంతా ముక్తకంఠంతో ఖండించారు. దాడి జరిగిన తీరును ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టన్ తపన్ డేకా వివరించారు.
అనంతరం విపక్ష నేతలు మాట్లాడుతూ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ వైఫల్యంపై ప్రశ్నలు గుప్పించారు. ‘‘భద్రతా దళాలెక్కడ? సీఆర్‌పీఎఫ్ ఎక్కడ?’’ అని నిలదీశారు. దేశంలో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయాల్సిందేనని పార్టీలకు అతీతంగా నేతలంతా అభిప్రాయపడ్డారు. ఈ దిశగా నిర్ణయాత్మక కార్యాచరణ ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో ప్రభుత్వానికి తమ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని చెప్పారు. ఉగ్రవాదాన్ని సమూలంగా అంతం చేసేందుకు జరుగుతున్న పోరాటంలో దేశ ప్రజలంతా ఏకతాటిపైకి రావాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు.
సానుకూల వాతావరణాన్ని దెబ్బతీయడానికే: కేంద్రం
ప్రజలకు భద్రత కల్పించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు అఖిలపక్షానికి ప్రభుత్వం వెల్లడించింది. మన దేశ ఆర్థికవ్యవస్థ పురోగమిస్తుండడం, జమ్మూకశ్మీర్‌లో పర్యాటకం ఊపందుకుంటున్న నేపథ్యంలో సానుకూల వాతావరణాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి దిగినట్లు పేర్కొంది. దాడి గురించి తెలియగానే కేంద్రం సరిగా స్పందించలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తప్పుపట్టారు. పహల్గాం దాడికి ప్రతిస్పందనగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా తాము అండగా ఉంటామని విపక్ష నేత రాహుల్ గాంధీ చెప్పారు. అఖిలపక్ష భేటీకి ప్రధాని మోదీ ఎందుకు రాలేదని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ ప్రశ్నించారు.
త్వరలో మోదీ నేతృత్వంలో అఖిలపక్షం నిర్వహించాలని తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయ కోరారు. దేశమంతా ఐక్యంగా ఉగ్రవాదంపై పోరాటం సాగించాలని అఖిలపక్ష నేతలు చెప్పినట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ఈ పోరాటంలో ప్రభుత్వానికి బాసటగా ఉంటామని హామీ ఇచ్చారన్నారు. అఖిలపక్ష భేటీలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, ఎస్.జైశంకర్, జె.పి.నడ్డా, కిరణ్ రిజిజుతోపాటు వివిధ పార్టీల నేతలు సుప్రియా సూలే (ఎన్సీపీ–ఎస్‌పీ), ప్రఫుల్ పటేల్ (ఎన్సీపీ), అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్), లావు శ్రీకృష్ణదేవరాయలు (టీడీపీ), శ్రీకాంత్ షిండే (శివసేన–షిండే), సుదీప్ బందోపాధ్యాయ, ప్రేమ్‌చంద్ గుప్తా, రాంగోపాల్ యాదవ్ (ఎస్పీ), తిరుచ్చి శివ (డీఎంకే) తదితరులు హాజరయ్యారు.