
న్యూఢిల్లీ: గర్భిణులకు కోవిడ్ టీకా వేయించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ తెలిపారు. అయితే, చిన్నారులకు కోవిడ్ టీకా ఇవ్వాలా వద్దా అనేది తేల్చేందుకు మరింత డేటా అందాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ‘గర్భవతులైన మహిళలకు కరోనా టీకాతో ఎంతో ఉపయోగం ఉంది. ఆరోగ్య శాఖ మార్గదర్శకాల్లో గర్భవతులకు టీకా ఇవ్వవచ్చని తెలిపింది’అని బలరాం భార్గవ చెప్పారు.
‘చిన్నారులకు కోవిడ్ టీకా వేయడంపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. అవసరమైన సమాచారం అందితేనే దీనిపై స్పష్టత వస్తుంది. ప్రపంచం మొత్తమ్మీద ఒక్క అమెరికాలోనే ప్రస్తుతం పిల్లలకు టీకా వేస్తున్నారు. టీకా తీసుకున్న కొందరు చిన్నారుల్లో కొన్ని సమస్యలు వస్తున్నాయి’అని ఆయన అన్నారు. ‘2–18 ఏళ్ల మధ్య వారికి టీకా ఇవ్వడంపై ఒక అధ్యయనం ప్రారంభించాం. దీని ఫలితం సెప్టెంబర్–అక్టోబర్ కల్లా అందుతుంది. దానిని బట్టే ఒక నిర్ణయం తీసుకుంటాం’ అని ఆయన స్పష్టం చేశారు.
చదవండి: మహారాష్ట్ర, కేరళ నుంచి వస్తే కరోనా పరీక్షలు తప్పనిసరి