
సాక్షి, న్యూఢిల్లీ: ముచ్చటగా మూడోసారి బీజేపీని అధికారంలోకి తీసుకుని రావడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ఈ ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటనలు చేశారు. ఒక్కో రోజు మూడు నుంచి ఐదు సభలు, రోడ్‌షోల్లో పాల్గొన్నారు. మార్చి 16న ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక మొత్తంగా మోదీ 206 సభలు, సమావేశాలు, రోడ్‌షో, ర్యాలీల్లో పాల్గొన్నారు.
ఒక్క మేలో 96 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.అత్యధిక ఎంపీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో ప్రధాని ఏకంగా 31 సభల్లో పాల్గొన్నారు. బిహార్‌లో 20, మహారాష్ట్రలో 19, పశి్చమబెంగాల్‌లో 16 సభలకు హాజరయ్యారు. కేవలం ఈ 4 రాష్ట్రాల్లోనే 86 సభల్లో మోదీ పాల్గొనడం గమనార్హం. దక్షిణాదిన కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారం చేశారు.
అత్యధికంగా కర్ణాటక, తెలంగాణల్లో 11, తమిళనాడులో 7 ప్రచార కార్యక్రమాల్లో మోదీ పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో మోదీ 145 సభలు, సమావేశాలు, రోడ్‌షో, ర్యాలీల్లో పాల్గొన్నారు. 2019లో 68 రోజులు ప్రచారంచేయగా ఈసారి 76 రోజులపాటు ప్రచారంచేశారు. ఈసారి ఆయన మొత్తం 80 మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చారు. అంటే సగటున రోజుకు ఒకటి కంటే ఎక్కువ.