
దాన్ని మించిన అథారిటీ లేదు: ధన్‌ఖడ్
ప్రజాప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్లు
సుప్రీంకోర్టు పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు
వ్యవస్థలు పరిధి మీరితే ఉపేక్షించొద్దు
జాతి ప్రయోజనాల కోసమే మాట్లాడా
విమర్శకులపై ఉపరాష్ట్రపతి ధ్వజం
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో పార్లమెంటే సర్వోన్నతమని పునరుద్ఘాటించారు. ‘‘దాన్ని మించిన అధికారాన్ని మన రాజ్యాంగం మరే అథారిటీకీ ఇవ్వలేదు. కనీసం అలాంటి భావనకు కూడా చోటివ్వలేదు. ఆ మాటకొస్తే దేశంలోని ప్రతి పౌరుడూ సుప్రీమే. ‘దేశ ప్రజలమైన మేము’ అంటూ రాజ్యాంగంలో రాసుకున్న మాట అణుబాంబు వంటిది. దానికున్న శక్తి ఎంతటిదో ప్రతి ఎన్నికల్లోనూ కనిపిస్తుంది’’ అంటూ కుండబద్దలు కొట్టారు. ‘‘రాజ్యాంగపరమైన అంశాల్లో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్.
రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత కూడా వారిదే’’ అని స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రపతి వంటి ఉన్నత రాజ్యాంగ పదవులు అలంకారప్రాయమైనవి మాత్రమేనని కొందరంటున్నారు. ఇది పూర్తి తప్పుడు అవగాహన. ప్రతి వ్యవస్థకూ తనవైన బాధ్యతలున్నాయి. ఇలా వాటి ప్రతిష్టను మసకబార్చజూస్తున్న దేశ వ్యతిరేక శక్తుల ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వరాదు’’ అని అభిప్రాయపడ్డారు. మంగళవారం ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. సుప్రీంకోర్టు పరిధులు దాటి వ్యవహరిస్తోందన్న తన వ్యాఖ్యలను పూర్తిగా సమర్థించుకున్నారు. వాటిని తప్పుబట్టిన వారిపై విరుచుకుపడ్డారు.
రాజ్యంగ హోదాలో ఉండే వ్యక్తులు మాట్లాడే ప్రతి మాటకూ దేశ అత్యున్నత ప్రయోజనాలే పరమావధి అని గుర్తుంచుకోవాలన్నారు. ‘‘సుప్రీంకోర్టు పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేసిన సందర్భాలెన్నో ఉన్నాయి. ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదని ఒక కేసులో, భాగమేనని మరో కేసులో పేర్కొంది. వ్యవస్థలు తమ రాజ్యాంగ పరిధిని మీరినప్పుడు మౌనం వహించడం ప్రమాదకరం. వీటిపై మేధావులు స్పందించాలి. ఆస్తులను ధ్వంసం చేసే, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే శక్తులను ఏరిపారేయాలి. నయానాభయానా వినని వారికి చేదుమందు తినిపించక తప్పదు. భారతీయత పట్ల ప్రతి ఒక్కరూ గర్వించాలి’’ అన్నారు.
రాజ్యాంగమే సుప్రీం: సిబల్
ధన్‌ఖడ్ తాజా వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మరోసారి తీవ్రంగా తప్పు బట్టా రు. పార్లమెంటు, కార్య నిర్వాహక వ్యవస్థల్లో ఏదీ సుప్రీం కాదని, రాజ్యాంగమే సర్వోన్నతమని అన్నారు. రాష్ట్రపతికి గడువు విషయంలో జాతి ప్రయో జనార్థం రాజ్యాంగ విలువలకు అనుగుణంగానే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందన్నారు. ‘చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు, రాజ్యాంగానికి సరైన భాష్యం చెప్పి పరిపూర్ణ న్యాయం అందించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుకు ఉన్నాయి’’ అని ఆర్టికల్ 142ను ఉటంకిస్తూ చెప్పారు. ఉపరాష్ట్రపతి స్థాయి వ్యక్తి ఇలా రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఎన్నడూ చూడలేదంటూ ధన్‌ఖడ్ గత వ్యాఖ్యలపై కూడా సిబల్ మండిపడటం తెలిసిందే.
మాటల మంటలు
బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతికి ఇటీవల సుప్రీంకోర్టు మూడు నెలల గడువు విధించడం, దాన్ని ధన్‌ఖడ్ తీవ్రంగా తప్పుబట్టడం తెలిసిందే. ‘‘న్యాయవ్యవస్థ సూపర్ పార్లమెంటుగా వ్యవహ రిస్తోంది. కార్యనిర్వాహక విధుల్లోకి చొరబడుతోంది. న్యాయ మూర్తులకు మాత్రం ఎలాంటి జవాబు దారీతనమూ లేదు. భారత్ ప్రజాస్వామ్య తరహా పాలనను ఎంచుకున్నది ఇలా న్యాయ మూర్తులే చట్టాలు చేసి కార్యనిర్వాహక విధులు కూడా నిర్వర్తించడానికి కాదు’’ అంటూ ఆక్షేపించారు. ధన్‌ఖడ్ వ్యాఖ్యలు రాజ్యాంగవిరుద్ధమంటూ విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. తాజాగా సుప్రీంకోర్టు కూడా వాటిపై పరోక్షంగా స్పందించింది. కార్య నిర్వాహక విధుల్లో తలదూరుస్తున్నామంటూ తమపై అభియోగాలు మోపుతు న్నారంటూ కాబోయే ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ సోమవారం ఓ కేసు విచారణ సందర్భంగా ఆవేదన వెలిబుచ్చారు.