
యూజర్ల వ్యక్తిగత సమాచారం తస్కరణ?
శ్రీనగర్: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రతీకార చర్యలపై ఆగ్రహంతో ఉన్న పాకిస్తాన్ తన సైబర్‌మూకలను రంగంలోకి దింపింది. దీంతో భారత రక్షణ రంగానికి సంబంధించిన వెబ్‌సైట్లపై పాక్ సైబర్ దాడుల ఉధృతి ఎక్కువైంది. అయితే రక్షణరంగంలోని వ్యక్తుల లాగిన్, పాస్‌వర్డ్ వంటి క్రెడెన్షియల్స్ తస్కరణకు గురయినట్లు భావిస్తున్నట్లు భారత సైన్యం తాజాగా ప్రకటించింది.
ఇండియన్ ఆర్మీ సోమవారం తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో ‘పాకిస్తాన్ సైబర్ ఫోర్స్’ పేరిట ఈ వివరాలతో ఒక పోస్ట్ పెట్టింది. మిలటరీ ఇంజనీర్ సర్వీసెస్, ది మనోహర్ పారికర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్ సంస్థల సిబ్బందికి చెందిన లాగిన్, పాస్‌వర్డ్‌లను పాక్ సైబర్ నేరగాళ్లు తమ వశంచేసుకున్నారు. రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌ను హ్యాకర్లు హ్యాక్‌చేశారు.
వెబ్‌సైట్ హోం పేజీపై పాకిస్తాన్ జెండా, అల్ ఖలీద్ యుద్ధట్యాంక్ ఫొటోలను పెట్టారు. ‘‘ ఈ వెబ్‌సైట్ ఇప్పుడు పాకిస్తాన్ వశమైంది. ఇది పాకిస్తాన్ సైబర్‌ఫోర్స్ పని. పహల్గాం కేవలం ఆరంభం మాత్రమే’’ అని సందేశాన్ని హ్యాకర్లు ఆ వెబ్‌సైట్‌లో పెట్టారు. దీంతో ముందుజాగ్రత్తగా భారత ఆర్మీ అధికారులు ఈ వెబ్‌సైట్‌ను ఆఫ్‌లైన్‌లో పెట్టేశారు. హ్యాకింగ్ కారణంగా వెబ్‌సైట్‌లోని సమాచారం ఏ స్థాయిలో చోరీకి గురైందన్న అంశాలపై విస్తృతస్థాయిలో ఆడిట్ చేశాకే వెబ్‌సైట్‌ను ఆన్‌లైన్‌లోకి తీసుకురానున్నారు.