Sheena Bora Murder Case: Indrani Mukerjea Walks Out Byculla Jail - Sakshi

ఇంద్రాణి ముఖర్జీ: కూతురి హత్య కేసులో ఆరున్నరేళ్ల తర్వాత బయటకు! ఆమె జీవితం తలకిందులు ఎలా అయ్యిందంటే..

Published Fri, May 20 2022 6:10 PM | Last Updated on Sat, May 21 2022 9:05 PM

Sheena Bora Murder Case: Indrani Mukherjea Walks Out Byculla Jail - Sakshi

జైలు నుంచి బయటకు వచ్చిన ఇంద్రాణి ముఖర్జీ మొదటి మాట ఏంటంటే.. చాలా చాలా సంతోషంగా ఉంది అని.

చాలా చాలా సంతోషంగా ఉంది.. బెయిల్‌ మీద బయటకు వచ్చిన ఇంద్రాణి ముఖర్జీ చెప్పిన మొదటి మాట ఇది. సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ జైలు నుంచి బయటకు వచ్చింది. సుప్రీం కోర్టు ఆమెకు బెయిల్‌ మంజూరు చేయగా.. రెండు లక్షల రూపాయల షూరిటీ బాండ్‌ మీద అనుమతి ఇచ్చింది సీబీఐ ప్రత్యేక కోర్టు. శుక్రవారం సాయంత్రం దక్షిణ ముంబైలోని బైకుల్లా జైలు నుంచి విడుదలయ్యింది ఆమె. సుమారు ఆరున్నరేళ్ల తర్వాత ఇంద్రాణి బయటి ప్రపంచాన్ని చూసింది. 

ముంబై: కన్న కుమార్తెనే హత్య చేసిందని ఆరోపణ ఎదుర్కొంటున్న ఇంద్రాణి ముఖర్జీ(50)కి.. సుప్రీంకోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది. మరో పదేళ్లయినా ఈ కేసు విచారణ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని, కాబట్టి.. బెయిల్‌ మంజూరు చేయాలని ఇంద్రాణి తరపు న్యాయవాది ముకుల్‌ విజ్ఞప్తి చేశారు. అయితే.. ఆరున్నరేళ్లు జైల్లో గడపడం అంటే చాలా సుదీర్ఘ కాలమని వ్యాఖ్యానించింది ఈ సందర్భంగా కోర్టు.. ఇప్పట్లో విచారణ పూర్తయ్యే అవకాశం లేనందున ఆమెకు బెయిల్‌ మంజూరు చేసింది. ఆపై సీబీఐ ప్రత్యేక కోర్టు కూడా షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో.. శుక్రవారం సాయంత్రం ఆమె బైకుల్లా జైలు నుంచి రిలీజ్‌ అయ్యారు.


1996లో ఐఎన్ఎక్స్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ పేరిట కోల్‌కతాలో రిక్రూట్‌మెంట్ కంపెనీని ఏర్పాటు చేసిన ఇంద్రాణీని 2008లో ది వాల్ స్ట్రీట్ జర్నల్ ‘50 విమెన్ టు వాచ్‌’లో ఒకరిగా గుర్తించింది. కానీ ఐఎన్ఎక్స్ మీడియాలో అక్రమాలు, కూతురి హత్య కేసు కారణంగా ఆమె జీవితం తలకిందులై.. ఇలా నేరపూరిత స్వభావంతో వార్తల్లోకి ఎక్కింది.

ముగ్గురు భర్తల ఇంద్రాణి..
ఇంద్రాణి ముఖర్జీకి మొదటి భర్తతో కలిగిన సంతానం షీనా బోరా. 2012లో ఆమె హత్య జరిగితే.. మూడేళ్ల వరకు ఆ విషయం బయటకు పొక్కలేదు. 2012లో షీనా బోరాను హత్య చేయగా.. మూడేళ్ల తర్వాత ఓ కేసులో ఇంద్రాణీ ముఖర్జీ కారు డ్రైవర్‌ శ్యామ్‌ రాయ్‌‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ హత్య కేసు గురించి తెలిసింది. షీనా బోరాను ఇంద్రాణీ గొంతు నులిమి చంపారని.. ఆమెను తన చెల్లెలిగా పరిచయం చేసుకున్నారని డ్రైవర్ పోలీసులకు తెలిపాడు.

ఇంద్రాణీ ముఖర్జీ మొత్తం ముగ్గుర్ని పెళ్లాడింది. ఆమెకు మొదటి భర్త ద్వారా షీనాతోపాటు మైఖేల్‌ అనే కుమారుడు జన్మించారు. అతడి నుంచి విడిపోయిన తర్వాత పిల్లలిద్దర్నీ గువాహటిలోని తన తల్లిదండ్రుల వద్ద ఉంచిన ఇంద్రాణీ.. సంజీవ్‌ ఖన్నా అనే వ్యక్తిని పెళ్లాడింది. కొన్నాళ్లకు అతడి నుంచి విడిపోయింది. అనంతరం మీడియా ఎగ్జిక్యూటివ్‌ అయిన పీటర్‌ ముఖర్జియాను మూడో వివాహం చేసుకుంది.

అప్పటికే పెద్దదయిన షీనా.. ముంబైకి వచ్చి ఇంద్రాణిని కలుసుకుంది. తన మొదటి పెళ్లి, పిల్లల గురించి పీటర్ దగ్గర దాచిపెట్టిన ఇంద్రాణి.. తన కూతుర్ని చెల్లెలిగా వారికి పరిచయం చేసింది. ఈ క్రమంలో పీటర్ మొదటి భార్య కుమారుడైన రాహుల్‌తో షీనా సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టింది. తన కూతురు వ్యవహరిస్తోన్న తీరు ఇంద్రాణికి నచ్చలేదు. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో.. పీటర్‌కు అసలు విషయం చెబుతానంటూ షీనా బ్లాక్‌మెయిలింగ్ మొదలుపెట్టింది. ఆమె తీరుతో విసిగిపోయిన ఇంద్రాణీ ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించింది.

ఇందుకోసం ప్లాన్ చేసి.. తన రెండో భర్త సంజీవ్‌, డ్రైవర్‌ శ్యామ్‌ రాయ్‌ సాయంతో షీనాను హత్య చేసింది. ఈ కేసులో 2015 సెప్టెంబర్‌లో ఇంద్రాణీ, సంజీవ్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు.. అనంతరం మూడో భర్త పీటర్‌ ముఖర్జియాను సైతం అదుపులోకి తీసుకున్నారు.

బతికే ఉందని డ్రామాలు

2019లో జైల్లో ఉండగానే పీటర్ ఆమెకు విడాకులు ఇచ్చాడు. 2020లో పీటర్‌కు బెయిల్ వచ్చింది. ఇంద్రాణీ జైల్లో శిక్ష పొందుతున్న సమయంలో.. తన కుమార్తె ప్రాణాలతోనే ఉందని సీబీఐకి లేఖ రాసింది. షీనా బోరాను జైలు అధికారి ఒకరు కశ్మీర్‌లో చూశానని చెప్పిందని ఆ లేఖలో పేర్కొన్న ఇంద్రాణి.. ఈ విషయమై దర్యాప్తు చేయాలని సీబీఐని కోరింది. ఇంద్రాణి ముఖర్జీ బెయిల్ మీద బయటకు రావడం కోసం అనేక సార్లు ప్రయత్నించి విఫలమైంది. ఆరున్నరేళ్లపాటు శిక్ష అనుభవించాక ఎట్టకేలకు ఆమెకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించి 237 సాక్షుల్లో ఇప్పటివరకు ప్రాసిక్యూషన్‌ 68 మందిని మాత్రమే విచారించింది.

చదవండి: షీనా బతికే ఉందా? బయటకొచ్చిన ఇంద్రాణి ఏం చెప్పిందంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement