ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. మరో వైపున ఉదయం, సాయంత్రం వేళ భక్తుల రద్దీ మరింత పెరుగుతుండగా, వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు క్యూలైన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో రూ. 500 టికెట్ల విక్రయాలను ఉదయం 8 గంటల నుంచే నిలిపివేశారు. దీంతో వీఐపీలకు, రూ. 300 టికెట్టు కొనుగోలు చేసిన భక్తులకు ముఖ మండప దర్శనం కల్పించారు. రద్దీ నేపథ్యంలో భక్తులకు అమ్మవారి దర్శనం త్వరత్వరగా జరిగేలా క్యూలైన్లను ముందుకు నడిపించారు. ఆలయ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ భక్తులకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో, చలివేంద్రాలలో మజ్జిగ, మంచినీటిని అందించారు. అమ్మవారి దర్శనం అనంతరం భక్తులకు ఉచిత ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదాలను అందజేశారు. మహా మండపం రెండో అంతస్తులో సిట్టింగ్ పద్ధతిలో, మొదటి అంతస్తులో బఫే పద్ధతిలో అన్న ప్రసాదాన్ని అందజేశారు.
ఉదయం, సాయంత్రం వేళల్లో
పెరుగుతున్న రద్దీ
ఆర్జిత సేవలకు డిమాండ్..
చైత్ర అమావాస్య, ఆదివారం నేపథ్యంలో పలు ఆర్జిత సేవలకు డిమాండ్ పెరిగింది. తెల్లవారుజామున అమ్మవారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్ వద్ద నిర్వహించే ఖడ్గమాలార్చనకు 20 టికెట్లు, చండీహోమానికి రికార్డు స్థాయిలో రెండు వందలు టికెట్లను విక్రయించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, యాగశాలలో నవగ్రహ హోమం, గణపతి హోమాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మల్లేశ్వర స్వామి వారి ఆలయం వద్ద అర్చకులు శాంతి కల్యాణాన్ని నిర్వహించారు. సాయంత్రం నిర్వహించిన పంచహారతుల సేవ, పల్లకీ సేవలోనూ ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు.
సూర్యోపాసన సేవ..
లోక కల్యాణార్థం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆదివారం సూర్యోపాసన సేవ నిర్వహించారు. రాజగోపురం వద్ద ఆలయ అర్చకులు సూర్య భగవానుడి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
ఇంద్రగిరిపై భక్తజన కోలాహలం