
సహాయక కార్యక్రమాల్లో జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి
కొరాపుట్/రాయగడ/భువనేశ్వర్: రైలు దుర్ఘటన జరిగిన విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన వెంటనే బాలేశ్వర్, భద్రక్ జిల్లాల యువత స్పందించారు. ఎటువంటి పిలుపు లేకుండానే తమవంతు సాయం అందించేందుకు ముందుకు కదిలారు. భద్రక్, బాలేశ్వర్ జిల్లా కేంద్రాల అస్పత్రుల వద్దకు చేరుకొని, అవసరమైన క్షతగ్రాతులకు రక్తదానం చేసేందుకు సిద్ధమయ్యారు. రాత్రి నుంచి ఉదయం వరకు క్యూలోనే ఉండి రక్తదానం చేశారు. సుమారు వెయ్యి మంది యువత రక్తదానం చేసి, ప్రాణదాతలుగా నిలిచారు.
సత్యసాయి భక్తుల సేవలు..
రైల్వే దుర్ఘటన జరిగిన వెంటనే సత్యసాయి భక్తుల సేవలు మొదలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే సత్యసాయి సేవాసమితి అఖిల భారత సమన్వయకర్త నిమిష్ పాండ్యా, జాతీయ సేవా సమన్వయకర్త కోటేశ్వరరావు, రాయగడకు చెందిన ఒడిశా సత్యసాయి సేవాసమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరకవలస సునీల్‌కుమార్ మహంతి వ్యక్తిగతంగా రంగంలోకి దిగారు. వారి సూచనతో సుమారు 70మంది సేవాదళ్ కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తాము తీసుకు వచ్చిన ట్రాక్టర్లపై క్షతగాత్రులు, మృతదేహాలను ఆస్పత్రులకు తరలించారు. వైద్య సిబ్బంది తగినంత లేకపోవడంతో తామే స్వపర్యలు చేసి, ప్రాథమిక చికిత్స అందజేశారు. అలాగే బాధితులకు ఆహారం, తాగునీరు అందించి, అందిరి మన్ననలు పొందారు.
ఎమ్మెల్యే బాహిణీపతి గొప్ప మనసు..
ప్రమాదం జరిగిన వెంటనే జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి గొప్ప మనసు చాటుకున్నారు. రాత్రి ఘటన జరిగిన సమయంలో భువనేశ్వర్ ఉన్న ఆయన.. సమాచారం తెలిసిన వెంటనే కాంగ్రెస్ కార్యకర్తలతో బాలేశ్వర్ వెళ్లారు. తనతో వచ్చిన కార్యకర్తలతో కలిసి క్షతగాత్రులకు సేవలు అందజేశారు. సమీప ఆస్పత్రులకు వెళ్లి రోగులను పరామర్శించారు. తన సొంత ఖర్చులతో అవసరమైన నిత్యవసరాలు, ఆహారం అందజేసి, అందరి మన్ననలు పొందారు.
యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు..
బాలేశ్వర్ సమీపంలోని బహనాగ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ప్రదీప్ జెన్న తెలియజేశారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుమారు వెయ్యి మందికి పైగా గాయాలైన వారిని, సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నామన్నారు. తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స అందజేసేందుకు ఎస్‌సీబీ, బారిపద మెడికల్ కేంద్రాలకు తరలించామన్నారు. మృతిచెందిన వారికి సంబంధించిన బాధిత కుటుంబాలు వచ్చి సరైన ఆధారాలను చూపిస్తే మృతదేహాలను అప్పగించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే కొంతమంది మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించడం జరిగిందని వివరించారు. గుర్తించని మృతదేహాలను భద్రపరిచి, 72 గంటల వ్యవధిలో ఎటువంటి ఆచూకీ తెలియకపోతే నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు గురించి ఆలోచిస్తామని పేర్కొన్నారు.