
● అనుమానాస్పదంగా విద్యార్థి మృతి ● లొద్దపుట్టి ఆర్‌హెచ్ కాలనీలో విషాదం
ఇచ్ఛాపురం రూరల్: ‘అమ్మా...ఈ రోజు ఇంటికి వస్తున్నాను...’ అని కన్న కొడుకు తల్లికి ఫోన్‌లో సమాచారం అందించాడు. దీంతో ఆ తల్లి కొడుకుకు ఇష్టమైన వంటకాలు చేసి వేయి కళ్లతో ఎదురు చూడటం ప్రారంభించింది. ఉదయం ఫోన్ చేసిన కొడుకు రాత్రి పన్నెండు గంటలైనా ఇంటికి చేరకపోవడంతో ఫోన్ చేసింది. స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళనకు గురైంది. తెల్లారితే... కొడుకు చదువుతున్న కళాశాలకు ఫోన్ చేస్తే మృతి చెందాడన్న పిడుగులాంటి వార్తను చేరవేయడంతో ఆ తల్లి గుండె పగిలేలా విలపించింది. వివరాల్లోకి వెళితే.. ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి గ్రామం ఆర్‌హెచ్ కాలనీకి చెందిన నెయ్యిల నీలాద్రి(లడ్డూ), ఢిల్లేశ్వరీల కుమారుడు గోపాల్(19). విశాఖపట్నం జిల్లా తగరపువలసలోని అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లమో సెకెండియర్ చదువుతున్నాడు. తండ్రి నీలాద్రి గల్ఫ్‌లో కూలి పనులు చేస్తున్నాడు. సోమవారం తల్లికి ఫోన్ చేసి ‘అమ్మా....ఈ రోజు ఇంటికి వస్తున్నాను’ అంటూ చెప్పిన గోపాల్ అర్థరాత్రి వరకు ఇంటికి చేరక పోవడంతో మంగళవారం ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేసింది. గోపాల్ విజయనగరంలోని రైలు కింద పడి మృతి చెందినట్లు చెప్పడంతో తల్లి కుప్పకూలిపోయింది. కుమారుడు రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసేకునేంత పిరికి వాడు కాదని, కుమారుడు మృతి వెనుక కుట్రదాగి ఉందని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. విద్యార్థి గోపాల్ మృతితో గ్రామంలో విషాధ చాయలు అలముకున్నాయి.