
ఐదు కిలోల గంజాయి స్వాధీనం
పాతపట్నం: అక్రమంగా గంజాయి తరలిస్తున్న గార మండలం పొగాకువానిపేట గ్రామానికి చెందిన దువ్వు సాయి సురేష్ రెడ్డి అలియాస్ సాయి అనే యువకుడిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. పాతపట్నం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సీఐ వి.రామారావు విలేకరులకు వివరాలు వెల్లడించారు. గార మండలం పొగాకువానిపేటకు చెందిన దువ్వు సాయి సురేష్ రెడ్డి అలియాస్ సాయి ఐటీఐ చదువుతూ మధ్యలో మానేసి వెల్డింగ్ పనులు చేస్తుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం నెల్లూరు జిల్లాకు తరలించేందుకు 5.662 కిలోల గంజాయిని 3 ప్యాకెట్లుగా తయారు చేసి బ్యాగ్‌తో ఒడిశా నుంచి నడిచి వస్తుండగా పాతపట్నం చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన వ్యక్తికి అప్పగించేందుకు గంజాయిని తీసుకొస్తున్నట్లు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని సాయిని అరెస్టు చేశారు. సమావేశంలో ఎస్‌ఐ బి.లావణ్య, ఏఎస్‌ఐ సింహాచలం, పోలీసులు పాల్గొన్నారు.