
సమస్యల పరిష్కారానికే ‘భూభారతి’
● రేపటి నుంచి అవగాహన సదస్సులు ● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం ‘భూభారతి’ ఆర్వోఆర్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం అడిషనల్ కలెక్టర్ వేణుతో కలిసి అధికారులతో భూభారతి అమలు తీరుపై సమీక్షించారు. ఈనెల 17 నుంచి 30వరకు భూ భారతిపై అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతీరోజు కనీసం రెండు గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పెండింగ్ ధరణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్, మార్కింగ్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, తహసీల్దార్లు పాల్గొన్నారు.
లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లుండొద్దు..
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లు ఉండొద్దని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. అర్హులైన పేదలకే ఇళ్లు కేటాయించాలని సూచించారు. ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించిందని, అందులో పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో మంజూరు చేశామని, మిగతా వాటిని అర్హులైన వారికి కేటాయించాలన్నారు. ఈనెల 22 నుంచి 30 వ తేదీ వరకు మరోసారి క్షేత్రస్థాయి తనిఖీ చేయాలని ఆయన చెప్పారు. అనర్హులను జాబితా నుంచి తొలగించాలన్నారు. ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, డీఆర్డీవో కాళిందిని, డీపీవో వీరబుచ్చయ్య, సీఈవో నరేందర్ పాల్గొన్నారు.
తాగునీటి ఇబ్బందులు రావొద్దు..
వేసవి ముగిసే వరకూ ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ఇంటింటికీ తాగునీరు సరఫరా చేయాలని ఆయన అన్నారు. తాగునీటి సమస్యలు ఉంటే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇందుకోసం నిధులు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. గ్రిడ్ ఈఈ పూర్ణచందర్‌రావు, ఇంట్రా ఈఈ గంగాధర శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.