
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
జిల్లా సమాచారం
● ఊపందుకుంటున్న వరి కోతలు
● ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలివస్తున్న వడ్లు
పెద్దపల్లిరూరల్: జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. వరికోతలు పూర్తి చేసిన రైతులు వడ్లను కొనుగోలు కేంద్రాలకు తరలించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈసారి కూడా హార్వెస్టర్లతోనే వరి కోతలు ముమ్మరం చేశారు.
దిగుబడి అంచనా 4.50లక్షల మెట్రిక్ టన్నులు
జిల్లాలో ఈసారి 1,98,201 ఎకరాల్లో వరి సాగైంది. సుమారు 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని అఽధికారులు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అందుబాటులో ప్యాడీ క్లీనర్లు..
నిబంధనలకు అనుగుణంగా ధాన్యంలో చెత్తాచెదారం, మట్టిపెళ్లలు తొలగించేందుకు ప్యాడీ క్లీనర్లు, తూర్పార పట్టేయంత్రాలు, తేమశాతం నిర్ధారించే పరికరాలు, తూకం యంత్రాలు సిద్ధం చేశామని అధికారులు వివరించారు. పాత పద్ధతిన ధాన్యం శుభ్రం చేసే యంత్రాలు 521 ఉండగా, లేటెస్ట్ టె క్నాలజీతో కూడిన మరో 154 ప్యాడీ క్లీనర్లు అందుబాటులోకి తీసుకొచ్చామని వారు తెలిపారు. వీటిని అత్యధికంగా ధాన్యం నిల్వలు ఉండే కొనుగోలు కేంద్రాల్లో వినియోగిస్తామని వారు వివరించారు.
1.12 కోట్ల గన్నీ సంచులు అవసరం..
ధాన్యం కోసం దాదాపు 1.12 కోట్ల గన్నీ సంచులు అవసరమవుతాయని అంచనా వేశారు. ప్రస్తుతానికి 20 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయని, అవసరాన్ని బట్టి మరిన్నొ తెప్పిస్తామని పేర్కొన్నారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించేందుకు 150 లారీలను సిద్ధం చేశారు. హమాలీలను అందుబాటులో ఉంచారు.
కొనుగోలు కేంద్రాలు 324
వరి సాగు విస్తీర్ణం(ఎకరాల్లో) 1,98,201
దిగుబడి అంచనా(మెట్రిక్ టన్నుల్లో) 4,50,000
ప్యాడీ క్లీనర్లు(పాతవి) 521
ప్యాడీ క్లీనర్లు(ఆధునికమైనవి) 154
అవసరమయ్యే గన్నీ సంచులు 1,12,00,000
అందుబాటులో ఉన్నవి 20,00,000
రవాణా కోసం సిద్ధం చేసిన లారీలు 150