
భూ సమస్యల పరిష్కారానికే ‘భూ భారతి’
ఓదెల/ముత్తారం: భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూ భారతి చట్టం ప్రవేశపెట్టిందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం ఓదెల, ముత్తారం తహసీల్దార్ కార్యాలయాల్లో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న 9.25లక్షల సమస్యలు భూభారతితో పరిష్కారం అవుతాయన్నారు. భూభారతి చట్టం ద్వారా భూమి సరిహద్దులు పక్కాగా నిర్ణయిస్తారని తెలిపారు. భూ హక్కుదారులకు ఉచిత న్యాయ సాయం అందుబాటులో ఉందని అన్నారు. భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ముందు తప్పనిసరిగా భూమి సర్వే జరిపించి మ్యాప్ తయారు చేయించాల్సి ఉంటుందని, ఇందుకు గ్రామస్థాయిలో పరిపాలన అధికారిని నియమించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పీహెచ్‌సీ, ఐకేపీ సెంటర్ సందర్శన
ఓదెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను కలెక్టర్ శ్రీహర్ష గురువారం సందర్శించి రోగుల కు వైద్య సేవలు అందుతున్నాయా లేదా తెలుసుకున్నారు. సిబ్బంది సమయపాలనపై ఆరా తీశా రు. ఐకేపీ సెంటర్‌ను సందర్శించి ధాన్యం కొనుగోళ్లపై రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, అదనపు కలెక్టర్ వేణు, ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్ సునీత తదితరులున్నారు.
ఆస్పత్రి నిర్మాణానికి భూమి చూడండి
మంథని: మంథనిలో నూతనంగా 50 పడకల ఆస్పత్రి నిర్మించేందుకు భూమిని త్వరగా అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గురువారం మంథనిలో పలు స్థలాలను సందర్శించారు. పాత నీటి పారుదల కార్యాలయం, ఇతర కార్యాలయాలను అనువైన చోటికి తరలించే పనులను పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో సురేష్, మున్సిపల్ కమిషనర్ మనోహర్ తదితరులు ఉన్నారు.
● కలెక్టర్ కోయ శ్రీహర్ష