
పచ్చదనం పెంచేలా చర్యలు
కోల్‌సిటీ: రామగుండంలో పచ్చదనం పెంచేలా చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్‌ఏసీ) జె.అరుణశ్రీ అధికారులను ఆదేశించారు. గురువారం అశోక్‌నగర్ ఉపరితల జలాశయం ఆవరణలోని పట్టణ ప్రకృతి వనంను పరిశీలించారు. అమృత్ పథకంలో భాగంగా ఉద్యానవనాలు, పచ్చదనం పెంచేందుకు కేటాయించిన నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విఠల్‌నగర్‌లో డ్రైయిన్ నిర్మాణ పనులు, 27, 29, 7వ డివిజన్లలో పర్యటించి అభివృద్ధి పనులకు సంబంధించి పలు సూచనలుచేశారు. ఆమె వెంట ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ రామన్, ఏఈ తేజస్విని, టీపీఎస్ నవీన్ తదితరులున్నారు.
మలవ్యర్థాలను ఎఫ్‌ఎస్‌టీపీకి తరలించాలి
సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ వాహనాల ద్వారా సేకరించిన మల వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేయకుండా మల్కాపూర్‌లో ఏర్పాటు చేసిన ఫీకల్ స్లడ్స్ ట్రీట్మెంట్(ఎఫ్‌ఎస్‌టీపీ)కు తరలించాలని కమిషనర్ అరుణశ్రీ సూచించారు. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసే అన్ని వాహనాలు నగర పాలక సంస్థ కార్యాలయంలో తమ వివరాలు నమోదు చేసుకొని అనుమతి పొందాలన్నారు. మలవ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడవేస్తే వాహనాలకు జరిమానా విధించి వాహనాన్ని సీజ్ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కొనసాగుతున్న దరఖాస్తుల పరిశీలన
కోల్‌సిటీ: రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ సాఫీగా సాగుతోంది. గురువారం మూడు బ్యాంకు శాఖలకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన నిర్వహించారు. భారీగా దరఖాస్తుదారులు తరలివస్తుండడంతో బ్యాంకు శాఖల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. మైకుల ద్వారా అభ్యర్థులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఇబ్బందులు కలగకుండా డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి పర్యవేక్షిస్తున్నారు.
న్యాయవాదుల విధుల బహిష్కరణ
పెద్దపల్లిరూరల్: కాశ్మీర్‌లో ఉగ్రదాడిని నిరసిస్తూ పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లకిడి భాస్కర్ ఆధ్వర్యంలో గురువారం న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఉగ్రవాదులు కాశ్మీర్‌లో కాల్పులు జరిపి ప్రాణాలు తీయడం దుర్మార్గమన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందించారు. న్యాయవాదులు సత్యనారాయణరెడ్డి, మొగిలి, అజయ్ క్రాంతిసింగ్, డివిఎస్‌మూర్తి తదితరులు పాల్గొన్నారు.
కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌ల రద్దుకు పోరాడుదాం
గోదావరిఖని: కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌కోడ్‌ల రద్దు కోసం ఉద్యమించాలని ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఇ.నరేశ్ అన్నారు. ఆర్జీ–1 సివిక్ విభాగంలో గురువారం మేడే పోస్టర్ విడుదల చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను అమలు చేసి దేశంలో ఉన్న 50 కోట్ల మంది కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. సింగరేణి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి వేయడం నిలిపివేసి, ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించాలని కోరారు. నాయకులు ఐ.రాజేశం, ఎడ్ల రవికుమార్, దీక్ష కుమారి, రాజేశ్వరి, సాయి, హరి, లక్ష్మి, మమత, దుర్గ, సంపత్, పోశమ్మ, శేఖర్ పాల్గొన్నారు.

పచ్చదనం పెంచేలా చర్యలు

పచ్చదనం పెంచేలా చర్యలు