
నలభై ఏళ్ల పాలనలో ఒక్క బ్రిడ్జి కట్టలే
● మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్
మంథని: నలభై ఏళ్లు నియోజకవర్గాన్ని పాలించిన తండ్రీకొడుకల హయాంలో ఒక్క బ్రిడ్జి నిర్మించలేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. శనివారం మండలంలోని అడవిసోమన్‌పల్లి సమీపంలో మానేరు బ్రిడ్జి మరమ్మతు పనులను పరిశీలించారు. స్వర్గీయ పీవీ నరసింహారావు మంథని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అడవిసోమన్‌పల్లి మానేరుపై వంతెన నిర్మించారన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో తాను రెండు బ్రిడ్జిలు మంజూరు చేయించడం జరిగిందన్నారు. తన సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కోసం రూ.300 కోట్లతో అవసరం లేని చోట బ్రిడ్జి తీసుకవచ్చారని ఆరోపించారు. 16 నెలలు గడుస్తున్నా సోమన్‌పల్లి బ్రిడ్జి దయనీయ స్థితిలో ఉండడం విడ్డూరమని, కనీసం మరమ్మతులు చేయించలేని దుస్థితిలో మంత్రి ఉన్నాడని ఎద్దేవా చేశారు. ఇప్పటికై నా మరమ్మతు పనులు పూర్తి చేయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు తగరం శంకర్‌లాల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలి
రామగిరి(మంథని): రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలు పరిష్కారించాలని మాజీ ఎమ్మెల్యే మధుకర్ డిమాండ్ చేశారు. మంథని జేఎన్టీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కళాశాల ఎదుట 8 రోజులుగా చేస్తున్న సమ్మెకు శనివారం మద్దతు పలికారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్నివర్గాల ప్రజలను మోసం చేస్తుందన్నారు. వివిధ కళాశాలల్లో సుమారు 1,100 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల్లు విధులు నిర్వహిస్తున్నారని, నిబంధనల ప్రకారం రెగ్యులరైజ్ చేయలన్నారు. మండల అధ్యక్షుడు శంకేశీ రవీందర్, పూదరి సత్యనారాయణగౌడ్, నాయకులు పాల్గొన్నారు.