
భూ భారతితో మేలు
● ధరణి సమస్యల పరిష్కారానికే కొత్త చట్టం అమలులోకి.. ● అప్పీలుకు జిల్లాస్థాయిలో భూట్రిబ్యునల్ ఏర్పాటు ● సాదాబైనామాల విషయంలో ఆర్డీవోకు అధికారాలు ● స్థోమతలేని పేదలకు ప్రభుత్వం ద్వారా ఉచిత న్యాయసేవలు ● రైతుల సందేహాలు నివృత్తి చేసిన కలెక్టర్ కోయ శ్రీహర్ష
సాక్షి: కొత్త చట్టంపై అవగహన సదస్సులు ఎలా ఉన్నాయి? రైతులు అధికంగా ప్రస్తావిస్తున్న అంశాలు ఏమిటి?
కలెక్టర్: జిల్లాలోని 14మండలాల్లో ఇప్పటివరకు 10 మండలాల్లో చేపట్టిన అవగాహన సదస్సులకు హాజరయ్యా. పేర్లు, విస్తీర్ణంలో పొరపాట్ల సవరణ, సాదాబైనామా, సర్వే నంబర్ల మిస్సింగ్స్‌పై రైతులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. భూహక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అ ర్హులైన వారు కొత్త చట్టం అమలులోకి వచ్చిన ఏడాదిలోపు దరఖాస్తు చేసుకునే వీలు ఉంది. ఆర్డీవో, తహసీల్దార్లు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ఈనెల 30 వరకు ప్రతీ మండలంలో కొత్త చట్టం గురించి వివరిస్తూ, రైతుల సందేహాలు నివృత్తి చేస్తాం.
సాక్షి: వారసత్వ భూములకు మ్యుటేషన్ ఎలా?
కలెక్టర్: ధరణిలో మ్యుటేషన్‌కు ముందు విచారణ లేదు. దీంతో వారసుల మధ్య వివాదాలు తలెత్తాయి. కానీ కొత్త చట్టంలో వారసత్వం లేదా వీలునామా ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే దరఖాస్తుతోపాటు వారసుల ఒప్పంద పత్రం లేదా వీలునామా కాపీ, సర్వేమ్యాపు జతచేసి దరఖాస్తు చేసుకోవాలి. తహసీల్దార్ 30రోజుల్లో విచారణ జరిపి మ్యుటేషన్ చేస్తారు. నిర్ణీత వ్యవధిలో కాకపోతే ఆటోమెటిక్‌గా మ్యుటేషన్ అవుతుంది.
సాక్షి: గతంలో భూ సమస్య పరిష్కారానికి సీసీఎల్‌కు వెళాల్సి వచ్చేది. కొత్త చట్టం ఆ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపుతుంది?
కలెక్టర్: ధరణి చట్టంలో అప్పీల్ వ్యవస్థ లేదు. కోర్టులను ఆశ్రయించాల్సిందే. కొత్తగా అమలులోకి తీసుకొచ్చిన భూభారతి చట్టంలో రెండంచెలుగల అప్పీల్ వ్యవస్థ ఉంది. తహసీల్దారు చేసిన మ్యుటేషన్లు లేదా జారీచేసిన పాసుపుస్తకాలు లేదా భూధార్‌పై అభ్యంతరాలు ఉంటే ఆర్డీవోకు, ఆయన ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు ఉంటే కలెక్టర్‌కు, కలెక్టర్ తీర్పుపై అభ్యంతరాలు ఉంటే భూమి ట్రిబ్యునల్‌కు రెండో అప్పీల్ చేసుకునే వీలుంది. ఇలా జిల్లాలోనే సమస్య పరిష్కారమవుతుంది.
సాక్షి: సాదాబైనామాల క్రమబద్ధీకరణకు భూభారతిలో అవకాశం ఉందా?
కలెక్టర్: 2014 జూన్ 2వ తేదీకన్నా ముందు వ్యవసాయ భూమిని సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసి, 12ఏళ్లుగా అనుభవంలో ఉంటే క్రమబద్ధీకరణ కోసం .. 2020 నవంబర్ 11 కన్నా ముందు దరఖాస్తు చేసుకున్న వాటిపై ఆర్డీవోలు విచారణ చేస్తారు. అర్హుల నుంచి ప్రస్తుత రిజిస్టేషన్, స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్ జారీచేస్తారు. హక్కుల రికార్డులో నమోదు చేసి పట్టాదారు పాసుపుస్తకం ఇస్తారు.
సాక్షి: కొత్త చట్టంలోని గ్రామ రెవెన్యూ వ్యవస్థలో ఏమైనా మార్పులు వచ్చాయా?
కలెక్టర్: భూమి హక్కుల రికార్డులోని వివరాలను ఈ రికార్డులో ఆన్‌లైన్ ద్వారా పొందుపరుస్తారు. మ్యుటేషన్ చేసిన ప్రతీసారి ఆన్‌లైన్‌లో గ్రామ లెక్కల్లో మార్పులు జరుగుతాయి. ఏటా డిసెంబర్ 31న గ్రామ రెవెన్యూ రికార్డులను ప్రింట్ తీసి భద్రపరుస్తారు. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు అధికారిని నియమిస్తారు.
మాట్లాడుతున్న
కలెక్టర్ కోయ శ్రీహర్ష
సాక్షి, పెద్దపల్లి: ప్రజల కోసం, ప్రత్యేకించి రైతులకు భూములపై భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ధరణిలోని అనేక సమస్యలకు ఇది పరిష్కారం చూపుతుందన్నారు. సమస్యపై దరఖాస్తు చేస్తే నిర్దేశిత సమయంలో పరిష్కరిస్తుందని తెలిపారు. ఏటా డిసెంబర్ 31న భూభారతి రికార్డులు అప్డేట్ చేస్తారన్నారు. అవినీతిని అరికట్టి, రెవెన్యూ శాఖను బలోపేతం చేయడానికి భూ భారతి ఆర్వోఆర్ చట్టం–2025లోని అనేక సందేహాలకు ‘సాక్షి’ ఇంటర్యూలో కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిష్కార మార్గాలు చూపారు.
సాక్షి: భూ భారతి, ధరణికి మధ్య తేడా ఏమిటి?
కలెక్టర్: ధరణితో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేందుకే భూభారతి చట్టం తీసుకొచ్చారు. విస్తీర్ణం తగ్గడం, సర్వే నంబర్, పేర్లలో పొరపాట్లు, పట్టాభూమి ప్రభుత్వ భూమిగా, కొనుగోలు చేసిన భూమి వారసత్వ భూమిగా నమోదు కావడం.. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. వీటి పరిష్కారానికి ఇప్పటిదాకా కోర్టుకు వెళ్లడం తప్ప మరోమార్గం లేదు. భూ భారతితో అప్పీల్ చేసుకునేందుకు జిల్లాస్థాయిలోనే ట్రిబ్యునల్ అందుబాటులోకి వస్తుంది. కోర్టుకు వెళ్లే అవసరం లేదు. జిల్లాస్థాయిలోనే భూసమస్యకు పరిష్కారం లభిస్తుంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు రికార్డు అవుతాయి.
సాక్షి: భూ ఆధార్ కార్డు అంటే ఏమిటి? దాని ఉపయోగం ఏమిటి?
కలెక్టర్: భూ రికార్డుల ఆధునీకరణలో భాగంగా ప్రతీ భూకమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇస్తారు. భవిష్యత్‌లో మనిషికి ఆధార్‌కార్డు ఉన్నట్లు భూమికి భూదార్ కార్డు అందిస్తారు. దీనికోసం జీపీఎస్ ద్వారా ఫిక్స్ చేసి ఫొటోతో కూడిన భూధార్‌ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిద్వారా చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. భూముల రిజిస్ట్రేషన్, మ్ముటేషన్‌కు ముందు తప్పనిసరిగా భూమి సర్వే చేసి మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుంది.

భూ భారతితో మేలు

భూ భారతితో మేలు