
భూ భారతి చట్టంపై విస్తృత ప్రచారం
జ్యోతినగర్/రామగుండం: భూ భారతి చట్టంపై ప్రజలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నామని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం ఎన్టీపీసీ రామగుండం టెంపరరీ టౌన్‌షిప్ ఉద్యోగ వికాస కేంద్రం మిలీనియం హాలు, అంతర్గాం మండలం రైతు భవన్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో భూభారతి చట్టంలోని వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. భూ భారతి చట్టం జూన్ 2 నుంచి అమల్లోకి వస్తుందని, అవగాహన కల్పించేందుకు ఈనెల 28వరకు ప్రతి మండల కేంద్రంలో సదస్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి మోక్షం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. నూతన చట్టంలో తహసీల్దార్‌తో భూ సమస్య పరిష్కారం కానప్పుడు ఆర్డీవోను సంప్రదించవచ్చని, అక్కడ కాకుంటే జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించేలా రెండంచెల అప్పీల్ వ్యవస్థను రూపొందించడం జరిగిందన్నారు. కలెక్టర్ వద్ద కూడా న్యాయం జరగని పక్షంలో భూ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో న్యాయపరమైన సమస్యను పరిష్కరించడం జరుగుతుందని, తద్వారా కోర్టులను ఆశ్రయించి కాలం వృథా చేసుకునే అవకాశం ఉండదన్నారు. ఈ వ్యవస్థలో ఏ అధికారి ఎన్ని రోజుల్లో సమస్యను పరిష్కరించనున్నారనే విషయమై ముందుగానే మార్గదర్శకాలను విడుదల చేసిందన్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఒకే రోజు ఉంటాయని, కొనుగోలు, భూదానం, తనఖా, భూ బదిలీ తదితర పంపకాల ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ రిజిష్ట్రేషన్ చేసి పట్టాదారు పాసు పుస్తకం జారీ చేస్తారన్నారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ వేణు, ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్లు ఈశ్వర్, రవీందర్‌పటేల్, డీఎఫ్‌వో, మండల పరిషత్ ప్రత్యేకాధికారి శివయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మడ్డి తిరుపతిగౌడ్, కాంగ్రెస్ మండల ప్రతినిధి పెండ్రు హన్మాన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టర్ కోయ శ్రీహర్ష