
ఆవేదన జీవితాంతం
ఆవేశం అదే క్షణం
● చిన్నచిన్న కారణాలకే బలవన్మరణాలు ● ఒంటరవుతున్న పిల్లలు, తల్లిదండ్రులు ● ఉమ్మడి జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న ఆత్మహత్యలు
సాక్షి ,పెద్దపల్లి ●:
అనారోగ్యంతో కొందరు, కుటుంబ కలహాలతో మరికొందరు, అప్పుల బాధ, నిరుద్యోగం, పరీక్షల్లో ఫెయిల్, ప్రేమలో విఫలం, ఇష్టం లేని పెళ్లితో ఇంకొందరు.. వరకట్న వేధింపులు, అవమానం, ఆవేశం ఇలా కారణాలు ఎన్ని ఉన్నా మానసిక ఒత్తిడిలో బలహీనమైన క్షణంలో బలమైన నిర్ణయాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆత్మహత్యలతో ఆయా కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాయి. మహిళలు ఆత్మహత్య చేసుకుంటే వారి పిల్లలు అనాథలవుతున్నారు. ప్రేమ, ఉద్యోగం, పరీక్షలు తదితర కారణాలతో యువత ఆత్మహత్యలకు పాల్పడి తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నారు.
రోజూ ఇద్దరు..
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో సంవత్సరానికి 8లక్షల మందికి పైగా, అంటే ప్రతీ సెకనుకు ఒకరు ఆత్మబలిదానం చేసుకుంటున్నారు. ప్రపంచంలో జరిగే ప్రతి 4 ఆత్మహత్యల్లో ఒకటి ఇండియాలోనే నమోదవుతోంది. ఉమ్మడి జిల్లాలో గతేడాది 776 మంది సూసైడ్ చేసుకున్నారు. అంటే సగటున ప్రతీ రోజుకు ఇద్దరు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏదో కారణంతో తమ ప్రాణాలు తీసుకుంటున్నారు.
నివారిద్దాం ఇలా..
నిరాశ, నిస్పృహల్లో ఉన్నవారికి స్వాంతన కలిగించడం ద్వారా ఆత్మహత్యలను తగ్గించవచ్చు. ఆత్మహత్య ఆలోచన రావడమే తరువాయి వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా వారిని మన వైపు మళ్లించవచ్చు. వారి బాధలను వినాలి, అర్థం చేసుకోవాలి. వారి సమస్యకు ఎలా పరిష్కారం దొరుకుతుందో వారితోనే చెప్పించాలి. ఇలాంటివారిని గుర్తించగానే ఒంటరిగా ఉంచకుండా నలుగురితో కలిసేలా కుటుంబసభ్యులంతా స్నేహంగా మెలగాలి. వారు సాధారణ జీవితం గడిపేంత వరకు వారిని గమనిస్తూ ఉండాలి. సమస్య మరీ తీవ్రంగా ఉంటే మానసిక వైద్యులను కలిసి చికిత్స ఇప్పించాలి.
గుర్తించడం ఇలా..
ఆత్మహత్య గురించి పదేపదే మాట్లాడుతుండటం, తనకు తాను హాని కలిగించుకునేందుకు ప్రయత్నించడం, తీవ్ర ఒత్తిడితో చికాకు పడుతుండటం, ఒంటరితనాన్ని ఇష్టపడటం, ప్రతీ విషయం గురించి ప్రతికూలంగా ఆలోచించడం, నిద్రపోకుండా ఉండటం, చేసే ప్రతి పనిపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం.. ఇలాంటి మార్పులు ఒక వ్యక్తిలో కనిపిస్తే, వారు ఆత్మహత్య గురించి ఆలోచనలు చేస్తుండొచ్చని భావించాలి.
● ‘ఏడాదిన్నర వయసు ఉన్న బిడ్డకు ఉరివేసి, అదే తాడుకు తల్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇటీవల పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది. తాను బక్కగా ఉన్నాననే బాధతో మనస్తాపం చెంది అఘాయిత్యానికి పాల్పడింది’.
● ‘ఈనెల 11న రామగుండం కార్పొరేషన్ 14వ డివిజన్ ఎల్కలపల్లి గేట్ గ్రామానికి చెందిన వివాహిత భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. దీంతో ముగ్గురు పిల్లలు తల్లిలేని బిడ్డలయ్యారు’.
● ‘గత నెల 6న చొప్పదండి మండలానికి చెందిన ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదని మనస్తాపం చెంది ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా ఓ కష్టం.. ఓ నష్టం.. ఆవేదన, ఆవేశం, ఆక్రోశం, మనిషిని తన ప్రాణం తాను తీసుకునేలా చేస్తోంది. దీంతో వారిపై ఆధారపడిన వారు ఒంటరవుతున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం.. వారి కుటుంబాలను జీవితాంతం ఆవేదన మిగుల్చుతోంది.
...వీరంతా బతకాల్సిన వారే
కౌన్సెలింగ్ తీసుకుంటే తప్పేంటి..
ఆత్మహత్య ఆలోచనలు వెంటాడుతున్న వారికి వీలైతే మానసిక వైద్యుడితో కౌన్సెలింగ్ ఇప్పించాలి. కానీ, మనదగ్గర మానసిక వైద్యం అంటే నామోషీ. మానసిక వైద్య చికిత్స అంటే.. అదేదో పిచ్చిపట్టినవాళ్లకు అందించే చికిత్స అనే భావన ప్రజల మెదళ్లలో నాటుకుపోవడం వల్లే ఈ సమస్య ఎక్కువ అవుతుంది. ఆత్మహత్యకు ముందు కొంతమంది ప్రదర్శించే నిర్దిష్ట లక్షణాలను అర్థం చేసుకోవడం ద్వారా చాలావరకు బలవన్మరణ కేసులను నివారించే అవకాశం ఉంటుందని మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.