
రాయి దాడిలో గాయపడిన సీఎం జగన్.. మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభించిన సీఎం జగన్.. తాజాగా దాడి గురించి స్పందించారు..
సాక్షి, కృష్ణా: ప్రజల ఆశీర్వాదం వల్లే తాను దాడి నుంచి తప్పించుకోగలిగానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైద్యులు విశ్రాంతి సూచించడంతో ఒక్కరోజు విరామం అనంతరం.. సోమవారం ఉదయం కేసరపల్లి నుంచి మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభించారాయన. అయితే యాత్ర ప్రారంభానికి ముందు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా నేతలు సీఎం జగన్‌ను కలిసి పరామర్శించారు.
‘‘ఇలాంటి దాడులు మనల్ని ఆపలేవు. మనకు దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం ఉన్నాయి. ధైర్యంగా అడుగులు ముందుకు వేద్ధాం. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదు. ప్రజల ఆశీర్వాదం నుంచే దాడి నుంచి తప్పించుకున్నా. మరోసారి అధికారంలోకి వస్తున్నాం. ఎలాంటి దాడులు మనల్ని ఆపలేవు’’ అని సీఎం జగన్, పార్టీ నేతలకు ధైర్యం చెప్పారు.
అయితే వైఎస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, బస్సు యాత్రకు వస్తున్న విశేష ఆదరణచూసి తట్టుకోలేక ఈ దారుణానికి పాల్పడ్డారని సీఎం జగన్ దృష్టికి వైఎస్సార్‌సీపీ నేతలు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా తన యోగక్షేమాలు అడిగి తెలుసుకునేందుకు వచ్చిన నేతలందరినీ అందరినీ చిరునవ్వుతో పలకరించిన సీఎం జగన్.. ఆ తర్వాత యాత్రను ప్రారంభించారు.