
సాక్షి,నల్గొండ: బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు నల్లగొండలో రైతు మహా ధర్నా జరగనుంది. ఈ ధర్నాకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. మాజీ మంత్రి గుంటకంట్ల జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్‌ఎస్ నాయకులు, రైతులు ధర్నాలో పాల్గొంటారు.
నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్‌లో నిర్వహించనున్న మహాధర్నా నిర్వహించేందుకు పోలీసులు మూడు గంటలు మాత్రమే అనుమతించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా నిర్వహించాలి. రైతు మహాధర్నా బీఆర్‌ఎస్ పార్టీ ఈనెల 12న నిర్వహించాల్సి ఉండగా.. సంక్రాంతి పండుగ నేపథ్యంలో వాయిదా వేసుకుంది.
తిరిగి ఈ నెల 21న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాక ధర్నాకు ఒక రోజు ముందు పోలీసులు అనుమతి నిరాకరించారు. సంక్రాంతి పండుగకు ఆంధ్రా ప్రాంతానికి వెళ్లిన వారు తిరిగి వస్తున్న క్రమంలో జాతీయ రహదారి అంతా రద్దీగా ఉంటుందని, పైగా క్లాక్ టవర్ సెంటర్ ఇరుకుగా ఉండటంతోపాటు, వాణిజ్య సముదాయాలు ఉన్నాయని, ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని, 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభలు ఉన్నందున బందోబస్తు కల్పించలేమని పోలీసులు అనుమతి నిరాకరించారు.
దీంతో బీఆర్‌ఎస్ నేతలు అదేరోజు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, హైకోర్టు ఈ నెల 27వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది.
కాగా, 27వ తేదీన కాకుండా 28వ తేదీన ధర్నా నిర్వహణకు పోలీసుల అనుమతికి బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్ దరఖాస్తు చేశారు. దీంతో పోలీసులు.. 1500 మందితో పట్టణంలో ఎన్‌టీఆర్ విగ్రహం నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీ నిర్వహించి, ఆ తర్వాత ధర్నా నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారు.

రైతుకు భరోసా ఇచ్చేందుకే మహా ధర్నా:జగదీష్‌రెడ్డి
‘రైతులు మొదటి నుంచీ బీఆర్‌ఎస్ వెంటే ఉన్నారు. వారిని ఆత్మహత్యల నుంచి బయట పడేసింది బీఆర్‌ఎస్ పార్టీనే. ప్రస్తుతం రైతాంగాన్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. అందరికి రుణ మాఫీ చేయలేదు. రూ.15 వేలు రైతు భరోసా ఇస్తామని తగ్గిస్తున్నారు. సన్న ధాన్యానికి బోనస్ ఇస్తామని మోసం చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు తిరుగుబాటు చేస్తున్నారు. గ్రామసభల్లో నిలదీశారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్ పార్టీ రైతులకు, ప్రజలకు అండగా ఉంటుంది. అందులో భాగంగానే రైతులకు భరోసా ఇచ్చేందుకు మహా ధర్నా చేపట్టబోతున్నాం. నల్లగొండ నుంచి రైతుల తరఫున పోరాటం చేసేందకు కేటీఆర్ వస్తున్నారు. బీఆర్‌ఎస్ ధర్నా అంటేనే జిల్లా మంత్రి, కాంగ్రెస్ నాయకులు భయపడిపోతున్నారు’అని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు.