
బీఆర్‌ఎస్ ఓటమితో తెలంగాణనే ఎక్కువ నష్టపోయింది
దేశంలో మత పిచ్చతో బీజేపీ రాజకీయాలు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్/ అత్తాపూర్: కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవటం తెలంగాణ సమాజానికి చారిత్రక అవసరమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నా రు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవలసిన బాధ్యత తెలంగాణ సమాజంపైనే ఉందని తెలిపారు. ఏప్రిల్ 27న వరంగల్‌లో జరిగే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ కు తరలివచ్చి కేసీఆర్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం రాజేంద్రనగర్ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి పటోళ్ల కార్తీక్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో అత్తాపూర్ డివిజన్‌కు చెందిన పలువురు నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు.
వారికి కేటీఆర్ గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లపాటు కేసీఆర్ అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ మళ్లీ వెనక్కు తీసుకెళ్తోందని మండిపడ్డారు. ‘మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో మనకు జరిగిన నష్టం తక్కువ. మన ఓటమితో తెలంగాణ సమాజానికి ఎక్కువ నష్టం జరిగింది.
స్వరాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్. ఈ రికార్డును ఎవరూ చెరపలేరు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామని ఎవరన్నా అనుకుంటే అది వారి అజ్ఞానం. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆనాడు ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. చంద్రబాబు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశారు. దండయాత్రలు చేసిన రాజులు కూడా ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెప్పరు’అని కేటీఆర్ అన్నారు.
బీజేపీకి మత పిచ్చి లేపడమే తెలుసు
‘దేశంలో మత పిచ్చి లేపడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ నాయకత్వంలో తెలంగాణ వెనక్కి పోయినట్టే.. మోదీ నాయకత్వంలో దేశం వెనక్కి పోతుందని అన్నారు. ‘మత పిచ్చి మంచిది కాదు. సమాజాన్ని విచ్ఛిన్నం చేయకూడదు. హిందువులు ప్రమాదంలో ఉన్నారట! 2014 వరకు మంచిగా ఉన్న హిందువులు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారట. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి లేని పంచాయితీ ఇప్పుడు ఎందుకు కొత్తగా పెడుతున్నారు? రాజకీయం కోసం దేశాన్ని విడగొడుతున్నారు. మంచి పనులు చేసి ఓట్లు అడగాలి. హిందూ, ముస్లిం, పాకిస్తాన్, జై శ్రీరాం, మోదీ.. ఈ ఐదు పదాలు చెప్పకుండా ఓట్లు అడిగేటోళ్లు ఎవరైనా ఉన్నారా? తెలంగాణకు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండూ శత్రువులే’అని కేటీఆర్ విమర్శించారు.
గరీబోళ్ల ఇండ్లపైకే హైడ్రా బుల్డోజర్లు
హైడ్రా పేరుతో ప్రభుత్వం పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు నడిపిస్తోందని కేటీఆర్ విమర్శించారు. ‘హైడ్రాతో ఆస్తులు కాపాడుతాం అంటున్నారు. చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, కేవీపీ రామచంద్రర్‌రావు, సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఇళ్లను మాత్రం ముట్టరు. అల్కగా దొరికే గరీబోని పైకి బుల్డోజర్లు పంపుతున్నారు. రైతుబంధు, తులం బంగారం, రుణమాఫీ, స్కూటీలకు పైసల్లేవు కానీ.. మూసీకి మాత్రం లక్షన్నర కోట్లు ఇస్తారట’అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.