
సాక్షి, విజయవాడ: విజయవాడ వరద మరణాలపై చంద్రబాబు సర్కార్ దొంగాట ఆడుతోంది. నిన్నటి వరకు 20 మందే మృతిచెందారని ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. నిన్న వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 32 మంది చనిపోయారని పేర్లతో సహా చెప్పారు.
ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడానికి అసలు అర్హుడివేనా? అని ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించాలంటూ చంద్రబాబును నిలదీశారు. విజయవాడ విపత్తుకు ముమ్మాటికీ చంద్రబాబు తప్పిదమే కారణమని పునరుద్ఘాటించారు. చేసిన తప్పులకు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విజయవాడ వరదలకు ఇప్పటికే 32 మంది బలి అయ్యారని.. ఇంకెందరు చనిపోయారో లెక్క తెలియడం లేదని.. ఆ మరణాలకు పూర్తి బాధ్యత చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. దీంతో 32 మంది చనిపోయారంటూ ఇవాళ చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. పోస్ట్ మార్టమ్ కోసం మృతదేహాలను మార్చురీకి తరలించారు.
మృతుల వివరాలు అధికారికంగా ప్రకటించకపోవడంపై మృతుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల్లో ఉన్న మృతుల కుటుంబాలకే ఆర్థిక సాయం అందిస్తున్నారు. దీంతో ప్రభుత్వ తీరుపై మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత్యక్రియలకు కూడా అధికారులు సహకరించడం లేదు. వరదల్లో గల్లంతైన వారి జాడ చెప్పాలంటూ బంధువులు వేడుకుంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగం సహకరించడం లేదని బాధితులు వాపోతున్నారు.