వారి ఉచ్చులో పడితే.. నష్టపోయేది మీరే: సీఎం రేవంత్‌ | Cm Revanth Reddy Comments On Brs Leaders | Sakshi
Sakshi News home page

వారి ఉచ్చులో పడితే.. నష్టపోయేది మీరే: సీఎం రేవంత్‌

Published Fri, Jan 3 2025 9:21 PM | Last Updated on Fri, Jan 3 2025 9:25 PM

Cm Revanth Reddy Comments On Brs Leaders

కష్టకాలంలో బాధ్యతలు చేపట్టామని.. ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

సాక్షి, హైదరాబాద్‌: కష్టకాలంలో బాధ్యతలు చేపట్టామని.. ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నామని  సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2025 డైరీ, క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రభుత్వానికి ఆదాయం లేకపోవడంతో కొన్ని సమస్యలను పరిష్కరించలేకపోతున్నామన్నారు.

‘‘ప్రతీ నెల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ.18500 కోట్లు. ఇది ప్రభుత్వ అవసరాలకు సరిపోవడంలేదు. అన్నీ సక్రమంగా నిర్వహించాలంటే రూ.30వేల కోట్లు కావాలి. వచ్చే ఆదాయంలో రూ.6500కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అవసరాలకు చెల్లిస్తున్నాం. మరో రూ. 6500 కోట్లు ప్రతీ నెల అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి. మిగిలిన రూ. 5500 కోట్లలో సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన పరిస్థితి. కనీస అవసరాలకు ప్రతీ నెల 22500 కోట్లు కావాలి. వచ్చిన ఆదాయంతో పోలిస్తే రూ.4000 కోట్లు తక్కువ పడుతోంది’’ అని సీఎం రేవంత్‌ వివరించారు.

‘‘గత పదేళ్లలో పరిపాలన వ్యవస్థను భ్రష్టు పట్టించారు. మేం అధికారంలోకి రాగానే పరిపాలన వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నం చేశాం. సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు చేర్చేది ఉద్యోగులే. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రంలో సామాజిక మార్పును తీసుకొచ్చాం. ఆర్థికపరమైన మార్పులు తీసుకురావాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది. రాష్ట్ర ఆదాయాన్ని పారదర్శకంగా ఖర్చు చేసేందుకు మీరు ఎలాంటి సలహాలు ఇచ్చినా తీసుకుంటాం. ప్రభుత్వ ఆదాయం ప్రతీ నెలా మరో రూ.4000 కోట్లు పెంచుకోవాలి. సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలి.

ఇదీ చదవండి: పాపం శంకర్‌.. గేమ్‌ ఛేంజర్‌ ఆయనతోనే తీయాల్సింది!

ఈ ప్రభుత్వం మనది.. ఆదాయాన్ని పెంచాలన్నా, పెంచిన ఆదాయం పంచాలన్నా మీ చేతుల్లోనే ఉంది. మీ సమస్యలు చెప్పండి. పరిష్కారానికి కార్యాచరణ చేపడతాం. ఈ ప్రభుత్వం మీ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరిస్తుంది. సమస్యల పరిష్కారానికి మీరు ధర్నాలే చేయాల్సిన అవసరం లేదు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయి. రాజకీయాల కోసం కొందరు నిరసనలు, ధర్నాలకు ప్రేరేపిస్తున్నారు. వారి ఉచ్చులో పడితే చివరకు నష్టపోయేది మీరే..

ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్  చేయాలని మాకు ఉన్నా చేయలేని పరిస్థితి. సర్వశిక్షా అభియాన్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్. ఆ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అవకాశం లేదు. నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేస్తే న్యాయస్థానాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవకాశం లేకపోయినా రెగ్యులరైజ్ చేయాలని పట్టుబడితే సమస్య పెరుగుతుంది తప్ప పరిష్కారం కాదు. ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు మీ సహకారం కావాలి. మీ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం. మిమ్మల్ని కష్టపెట్టి మీకు నష్టం కలిగే పనులు ప్రభుత్వం చేయదు’’ అని రేవంత్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement