
తిరుపతి మంగళం (తిరుపతి జిల్లా): నిత్యం ప్రజాసంక్షేమమే పరమావధిగా, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోసం ఏం చేయడానికైనా సిద్ధమని రాష్ట్ర అటవీ, విద్యుత్, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. సీఎం జగన్‌తో తనకు విభేదాలున్నా యంటూ ఎల్లో మీడియా అభూతకల్పనలు సృష్టించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆయన ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో తనకు విభేదాలుంటే తాను ఇంకా పార్టీలోఉంటానా? అని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాతో పాటు కుప్పంలో చంద్రబాబు ఉనికి కోల్పోయేలా చేస్తున్నానని తనకు, సీఎం జగన్‌కు మధ్య విభేదాలు సృష్టించాలన్న కుట్రలతో ఎల్లో మీడియా కట్టుకథలు రాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎంతో తాను ఎప్పుడూ సన్నిహితంగానే ఉంటానని, సీఎం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటానని చెప్పారు. అంతేతప్ప సీఎంతో విభేదాలు పెట్టుకునే అవసరం, తత్వం తనది కాదని స్పష్టం చేశారు. కేవలం చంద్రబాబును ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలన్న దురాలోచనతో ఎల్లో మీడియా తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. సీఎం జగన్‌కు పెద్దిరెడ్డిని దూరం చేస్తే చిత్తూరు జిల్లాతో పాటు కుప్పంలో ఉనికి కోల్పోకుండా ఉండవచ్చన్న ఆలోచనతో ఎల్లో మీడియా కట్టుకథలు అల్లుతూ విషపురాతలు రాస్తోందన్నారు. టీడీపీ ఇప్పటికే పాడెపైకి చేరిందని, చివరిదశలో చంద్రబాబు దింపుడు కళ్లం ఆశతో పోరాడుతున్నాడని చెప్పారు.
జగన్‌పై, తనపై, వైఎస్సార్‌సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులపై ఎలాంటి కట్టుకథలు రాసినా ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. రాజకీయ భవిష్యత్తు ప్రసాదించి 14 ఏళ్లపాటు అధికారంలో ఉండేలా చేసిన కుప్పం ప్రజలకు ఏం చేశావు చంద్రబాబూ.. అని ప్రశి్నంచారు. నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతున్న చంద్రబాబును ఈసారి కుప్పం ప్రజలు నమ్మి మోసపోయే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. దేశ రాజకీయ చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకానన్ని సంక్షేమ పథకాలు అందించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డినే తిరిగి గెలిపించేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.