పొలిటికల్ బిడారీ.. ఈసారెటు పరారీ | Ganta Srinivasa Rao Not Interested To Contest In Chipurupalli | Sakshi
Sakshi News home page

పొలిటికల్ బిడారీ.. ఈసారెటు పరారీ

Published Wed, Mar 20 2024 8:38 PM | Last Updated on Wed, Mar 20 2024 8:45 PM

Ganta Srinivasa Rao Not Interested To Contest In Chipurupalli - Sakshi

చీపురుపల్లి పోనే పోనంటున్న గంటా 

పోకపోతే ఇంటికెళిపో అని తేల్చేసిన బాబు

అప్పట్లో బిడారులు ఉండేవాళ్ళు..అంటే వాళ్లకు ఒక స్థిరనివాసం ఉండదు.. ఒక్కో ఊళ్ళో కొన్నేసి రోజులు ఉంటూ మళ్ళీ బతుకుదెరువుకోసం పయనం.. ఇంకో ఊళ్ళో కొన్నాళ్ళు నివాసం.. అలాగే రాజకీయాల్లో కూడా బిడారులు ఉంటారు.. అంటే ఒక్కో ఎలక్షన్కు ఒక్కో చోట పోటీ చేస్తారన్నమాట.. మళ్ళీ ఎన్నికల సమయానికి అక్కడ ఉండరు.. ఇంకో ఊరు చూసుకుంటారు. అదే కోవకు చెందినవారు సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాస్.. 2004లో టీడీపీతో కెరీర్ మొదలెట్టి చోడవరంలో ఎమ్మెల్యేగా గెలిచారు.

అయన పాలసీ ప్రకారం నియోజకవర్గం మార్చేయాలి కాబట్టి. 2009లో ఏకంగా పార్టీని కూడా మార్చేసి ప్రజారాజ్యం తరఫున  అనకాపల్లిలో గెలిచారు.. ఈసారి మళ్ళీ ఎన్నికలొచ్చాయి.. మళ్ళీ కొత్త నియోజకవర్గముతోబాటు కొత్త పార్టీ కావాలి కాబట్టి.. మళ్ళీ 2014లో భీమిలిలో టీడీపీ నుంచి గెలిచారు. ఇంకా 2019 లో  మళ్ళీ ఎన్నికలొచ్చాయి... పార్టీ మార్చడం కుదరలేదు.. నియోజకవర్గం మార్చేశారు.. విశాఖ నార్త్ కు వచ్చి గెలిచారు.. మళ్ళీ 2024 ఎన్నికలు రాగా అయ్హన అక్కడా ఇక్కడా పోటీ చేసేందుకు ట్రై చేసినా చంద్రబాబు పడనివ్వలేదు..ఈసారి ఏకంగా జిల్లామారిపోయి చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ మీద పోటీ చేయాలనీ ఆదేశించారు. 

తోచీతోచనమ్మ తోడికోడలు పుట్టింటికి పోయినట్లు ఎక్కడా సీట్ లేదని పోయిపోయి బొత్స ఎదురుగా పోటీ చేయడం అంటే డిక్కీ బలిసిన కోడి చికెన్ కొట్టుముందు తొడగొట్టడమే.. ఆ ముక్క గంటాకు తెలుసు.. అందుకే ఉహు.. నేను పోను అన్నారు. చీపురుపల్లి వస్తే ఏమవుతుందో గంటాకు తెలుసు.. ఇన్నాళ్లూ పార్టీలు నియోజకవర్గాలు మారుతూ గెలుస్తూ వస్తున్న తనకు చీపురుపల్లి వెళ్తే సీను సితార్ అని అర్థమైంది. అందుకే అబ్బబ్బే పోయినుగాక పోను అనేసారు.. పోకపోతే ఇంట్లో రెస్ట్ తీసుకో.. భీమిలి టిక్కెట్ నెల్లిమర్ల ఇంచార్జ్ బంగార్రాజుకు కానీ ఇంకెవరికో అయినా ఇస్తాను.. మీరు వెళ్తే భీమిలి వెళ్ళండి లేదా రెస్ట్ తీసుకోండి అని చంద్రబాబు చెప్పేశారు.

దీంతో ఈ పొలిటికల్ బీదవారికి సీట్ దక్కకుండా పోయింది. ప్రతి ఎన్నికకూ ఒక్కో పార్టీలో చేరడం.. ఒక ప్యాకేజి మాదిరి నాలుగైదు సీట్లు దక్కించుకుని తన మిత్రులతోకలిసి గెలవడం.. ప్రభుత్వాన్ని ఆడించడం  రివాజుగా పెట్టుకున్న గంటాకు ఈసారి గంట పగిలిపోయినట్లయింది. పోనీ ఎక్కడా లేదు కదాని చీపురుపల్లి వస్తే ఇక్కడి జనాలు కొండచీపురుతో కొట్టడం ఖాయం.. దానికితోడు చీపురుపల్లిలో నాలుగు మండలాల్లో సగం జనాన్ని పెట్టి పిలిచే చనువు.. విస్తృత పరిచయాలు ఉన్న బొత్స మీద పోటీ అంటే మాటలు కాదు.. వేరే జిల్లానుంచి ఇంపోర్ట్ అయిపోయి నేరుగా డబ్బులు విసిరేసి ఎన్నికలు చేద్దాం అంటే ఇక్కడ కుదరదు. అయన వస్తే ఓటర్లు సంగతి అటుంచి ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలు సైతం వ్యతిరేకంగా పనిచేస్తారు.

తోటి కాపు వాడు అనే సంగతి సైతం మరిచిపోయి ఎక్కణ్ణుంచో వచ్చి ఇక్కడెలా పెత్తనం చేస్తావు అంటూ నెత్తి వాచిపోయేలా గంట వాయిస్తారు.. స్థానికుడు టీడీపీ తరఫున పోటీ చేస్తే అదో లెక్క.. తప్పదు కాబట్టి పార్టీ కోసం పని చేస్తారు కానీ వేరే జిల్లాల నుంచి వచ్చేసి నేను కాపు.. నేను టీడీపీ కాబట్టి మీరంతా నన్ను గెలిపించండి అంటే కుదరదు.. ఆ విషయం గంటాకు తెలుసు.. అందుకే ఒళ్లనోరి మామా నేనొల్లను.. చీపురుపల్లి పోనే పోను అని మొరాయించారు.. ఈసారి గంటా విషయంలో చంద్రబాబు కూడా గట్టిగానే ఉన్నారు.. చెప్పాను కదా.. వెళ్తే చీపురుపల్లి వెళ్ళు.. లేదంటే మానెయ్.. అది నీ ఇష్టం.. మీటింగ్ ఓవర్.. నువ్విక వెళ్లొచ్చని తేల్చేసారు... దీంతో ఇప్పుడు ఈ రాజకీయ బిడారికి సీటు కరువైంది.

///సిమ్మాదిరప్పన్న///

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement