
రాంచీ: జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)కు చెందిన గిరిజన నేత హేమంత్ సోరెన్(49) ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని రాంచీలోని మొరాబాది మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆయనతో ప్రమాణం చేయించారు. తెల్లని కుర్తా పైజామా, నెహ్రూ జాకెట్ ధరించిన హేమంత్ ముందుగా జేఎంఎం చీఫ్, తన తండ్రి శిబూ సోరెన్‌ను కలుసుకున్నారు.
అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష ఇండియా కూటమి అగ్ర నేతలు హాజరయ్యారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో గిరిజనులు సంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా రాంచీలోని పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ, తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ దంపతులు ఉన్నారు. పంజాబ్ సీఎం మాన్, సీపీఐఎంఎల్ లిబరేషన్ జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య, ఎస్‌పీ చీఫ్ అఖిలేశ్, ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ కూడా హాజరయ్యారు. కాగా, సీఎంగా హేమంత్ ప్రమాణం చేయడం ఇది నాలుగోసారి.
ఇది చారిత్రక దినం
ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని హేమంత్ సోరెన్ ‘ఎక్స్’లో..‘ఇది చారిత్రక దినం..రాష్ట్ర ప్రజలు ఐకమత్యమే ఆయుధంగా చేసుకుని ఎన్నికల్లో తిరుగులేని తీర్పిచ్చారు. మా గొంతు నొక్కేందుకు వాళ్లు ప్రయత్నించిన ప్రతిసారీ ఉద్యమం మరింతగా తీవ్రతరమైంది. జార్ఖండ్ వాసులు ఎవరికీ తలొంచరు. తుది శ్వాస వరకు మా పోరాటం కొనసాగుతుంది’అని బీజేపీను ద్దేశించి వ్యాఖ్యానించారు. ఇటీవలి ఎన్నికల్లో అసెంబ్లీలోని 81 సీట్లకు గాను జేఎంఎం సారథ్యంలోని కూటమి అత్యధికంగా 56 సీట్లను సొంతం చేసుకుంది. 43 స్థానాల్లో పోటీకి దిగిన జేఎంఎం మొదటిసారిగా ఏకంగా 34 చోట్ల విజయకేతనం ఎగురవేసింది.
#WATCH | JMM executive president Hemant Soren takes oath as the 14th Chief Minister of Jharkhand, in Ranchi.
(Video: ANI/Jhargov TV) pic.twitter.com/30GxxK9CXe— ANI (@ANI) November 28, 2024