
హైదరాబాద్: కేటీఆర్, హరీష్ రావు, కవితలను సోషల్ బాయ్ కాట్ చేయాలని అంటున్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. 14 నెలల నుంచి ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని వీరు చేయలేదని, అందుచేత ఆ ముగ్గుర్ని సోషల్ బాయ్ కాట్ చేయాలని రఘునందన్ రావు సూచించారు. ఈరోజు(గురువారం) మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన రఘునందన్ రావు.. ‘ కేటీఆర్, హరీష్ రావు, కవితలు 14 నెలల నుంచి ప్రజలకు ఉపయోగపడే ఒక్క పనీ చేయలేదు.
గతంలో కేంద్రం కొండా బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ ఇస్తే తెల్లారే భూమి, యునివర్సిటీ పేరు మారింది. కేసీఆర్ గవర్నమెంట్ రాగానే ఎందుకు HCU భూములు బదలాయించలేదు.2012 నాటి జిల్లా కలెక్టర్ CCLA కు రాసిన లేఖ ఆధారంగా బదలాయించాలి. ఆనాడు వారి అవసరాలకు అనుగుణంగా దాన్ని పక్కన పెట్టిన కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.
ఎన్నో డాక్యుమెంట్స్ సేకరించి CEC సాధికారత కమిటీకి అందజేశా. సాధికారత కమిటీ చైర్మన్ సుప్రీంకోర్టు ముందు నన్ను వాదనలు వినిపిస్తారా అని అడిగారు. మేము రిఫర్ చేస్తాం వచ్చి వాదనలు వినిపించాలి అన్నారు. అవసరమైనప్పుడు పిలిస్తే వస్తా అని చెప్పా. HCU భూములు అంటూ ఆనాడు ప్రభుత్వం తెలుగులో రాసిన పంచనామా ఉంది. HCU భూములు కానప్పుడు ఆనాటి ప్రభుత్వం ఎందుకు పంచనామా చేసింది. గోపనపల్లిలో కేటాయించిన స్థలంలో వేర్వేరు సంస్థలు వచ్చాయి. ఇష్టారీతిన అమ్మాలని ప్రభుత్వం చూసింది. HCU భూములపై ఫైట్ చేసింది బీజేపీ’ అని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు.