
ముంబై: మణిపూర్ తరహాలో హింసాత్మక ఘటనలు మహారాష్ట్రలో కూడా జరిగే ప్రమాదం ఉందన్నారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్. మణిపూర్‌లో కొనసాగుతున్న హింసను కేంద్రంలోకి బీజేపీ ప్రభుత్వం అరికట్టలేకపోయిందన్నారు. ఈ సమస్య పరిష్కారంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని తీవ్ర విమర్శలు చేశారు.
కాగా, శరద్ పవార్ ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘మణిపూర్‌లో కుకులు, మెయిటీల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ రెండు సముహాల జాతి హింసను పరిష్కరించడంతో కేంద్రం విఫలమైంది. అలాగే, మహారాష్ట్రలో కూడా మరాఠీలు, ఓబీసీ రిజర్వేషన్ల గురించి కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. మణిపూర్ తరహాలోనే మహారాష్ట్రలో కూడా హింసాత్మక ఘటనలు చెలరేగే అవకాశం ఉంది. అయితే, ఎంతో మంది మహనీయులు మహారాష్ట్రలో సామరస్యాన్ని పెంపొందించారు. కాబట్టి అలాంటి ఘటనలు జరగకపోవచ్చు అనే అనుకుంటున్నాను. రిజర్వేషన్ల నిరసనలపై ప్రభుత్వం మరిన్ని చర్చలు జరపాలి. నిరసనకారులతో చర్చలు ఎందుకు జరపలేదు. ముఖ్యమంత్రి ఒక వర్గం వ్యక్తులతో మాట్లాడుతుండగా, ప్రభుత్వంలోని మరికొందరు వివిధ వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. ఇలా చేయడం సరైన పద్దతి కాదన్నారు.
ఇదే సమయంలో ప్రధాని మోదీపై శరద్ పవార్ తీవ్ర విమర్శలు చేశారు. మణిపూర్‌లో ఏడాది కాలంగా హింసా జరుగుతున్నా ఒక్కసారి కూడా మోదీ అక్కడికి వెళ్లలేదన్నారు. అక్కడి ప్రజలతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించలేదని మండిపడ్డారు. తరతరాలుగా జీవనం కొనసాగిస్తూ, సామరస్యాన్ని కొనసాగిస్తున్న మణిపురీలు నేడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి సిద్ధంగా లేరు. ఇలాంటి పరిస్థితికి కేంద్రం కూడా ఒక్క కారణమే అంటూ ఘాటు విమర్శలు చేశారు.