
న్యూఢిల్లీ : భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్ తీరును విమర్శిస్తూ విపక్ష పార్టీల 'ఇండియా' కూటమిలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఛైర్మన్ పదవి నుంచి ధన్‌ఖర్‌ను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(బి) ప్రకారం.. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ (రాజ్యసభ) తీర్మానం ద్వారా ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్ పదవి నుండి తొలగించవచ్చు అని ఇండియా కూటమి పార్టీల నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారంటూ పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
ఆర్టికల్ 67(బీ) అనుగుణంగా ధన్‌ఖర్‌పై చర్య తీసుకోవాలనే ప్రతిపాదనపై 87 మంది సభ్యులు సంతకం చేసినట్లు ప్రతిపక్ష పార్టీ నేతలు చెబుతున్నాయి. రెండ్రోజుల క్రితమే విపక్షాలు ధనఖర్‌ను తొలగించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాయని రాజ్యసభలో అధికార పక్ష నేత జేపీ నడ్డాకు సమాచారం అందిందని జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేశాయి.
ప్రతిపక్ష నాయకులు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైక్ కట్ చేయడం, అమర్యాదగా మాట్లాడడం వంటి అంశాలను ఎత్తి చూపుతూ ధన్‌ఖర్‌కు వ్యతిరేకంగా తీర్మానించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విపక్ష పార్టీ నేతలు మాత్రం సభను నిబంధనల ప్రకారం నడపాలని కోరుకుంటున్నాయని, సభ్యులపై వ్యక్తిగత వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆ వర్గాలు తెలిపాయి.
రాజ్యసభ ఛైర్మన్ ధన్‌ఖర్ సభను ఏకపక్షంగా నడుపుతున్నారని, ప్రతిపక్షంపై పక్షపాత వైఖరని ప్రదర్శిస్తున్నారంటూ కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు శుక్రవారం సభలో ఆందోళన చేపట్టాయి.
ఆమోదయోగ్యం కాని విధంగా సభలోని సభ్యుల్ని అగౌరపరుస్తున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. అనంతరం ప్రతిపక్ష నేతలు మాట్లాడుతూ.. ఎగువ సభలో ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ధన్‌ఖర్ ఇవ్వడం లేదని పేర్కొన్నాయి. ఈ తరుణంలో రాజ్యసభ ఛైర్మన్ ధన్‌ఖర్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యారు.