
ముద్రగడ నివాసంపై దాడి ఘటనపై పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది.
సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి నివాసంపై దాడి ఘటనపై పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. ఆయన నివాసంపై దాడి జనసేనకు సంబంధం లేదని ఆ పార్టీ నేతల ప్రకటించారు. అదే ప్రకటనను మీడియా గ్రూపులకు పోలీసు అధికారులు షేర్ చేశారు. దాడి అనంతరం ముద్రగడ నివాసం వద్ద జనసేన కార్యకర్త గంగాధర్ హల్ చల్ చేశాడు.
తాను జనసేన పార్టీ అని.. పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా అంటూ ఓవర్ యాక్షన్ చేశాడు. ట్రాక్టర్‌తో ముద్రగడ ఇంటిని దున్నేశానని గంగాధర్ చెప్పాడు. పోలీసుల తీరును జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు తప్పుబట్టారు. జనసేన పార్టీ తరుపున పోలీసులే ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా మారితే భాధితులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? అంటూ కన్నబాబు ప్రశ్నించారు.
కాగా, వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంటిపై దాడి సంచలనం కలిగించింది. జనసేన కార్యకర్త ట్రాక్టర్‌తో వచ్చి ఆయన ఇంటి వద్ద హల్‌చల్ చేశాడు. బీభత్సం సృష్టించి ఆయన కారును ధ్వంసం చేశాడు. సదరు యువకుడు ఆదివారం ఉదయం ముద్రగడ నివాసం వద్దకు ట్రాక్టర్ తీసుకుని వచ్చాడు. ఇంటి ముందు ర్యాంప్‌పై పార్క్ చేసిన కారును ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. ఈ క్రమంలో కారు ధ్వంసమైంది. తర్వాత, జై జనసేన అంటూ నినాదాలు చేసుకుంటూ ఓవరాక్షన్ చేశాడు.
కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి చేరుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు.. దాడి ఘటనపై ఆరా తీశారు. ముద్రగడను మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పరామర్శించారు. ముద్రగడ నివాసంపై జరిగిన దాడిని వైఎస్సార్‌సీపీ, కాపు నాయకులు ఖండించారు.
ఇదీ చదవండి: నిందితుడిది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటా.. పవన్ నోరు మెదపరేం?