అధికారం ఖర్గేకు  | Unanimous resolution of Congress Steering Committee | Sakshi
Sakshi News home page

అధికారం ఖర్గేకు 

Published Sat, Feb 25 2023 3:43 AM | Last Updated on Sat, Feb 25 2023 3:44 AM

Unanimous resolution of Congress Steering Committee - Sakshi

నవా రాయ్‌పూర్‌: కాంగ్రెస్‌ లో అత్యున్నత నిర్ణాయక విభాగమైన వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ)కి ఎన్నిక నిర్వహించరాదని పారీ నిర్ణయించింది. సీడబ్ల్యూసీ సభ్యులను నామినేట్‌ చేయాలని కాంగ్రెస్‌ స్టీరింగ్‌ కమిటీ తీర్మానించింది. ఈ అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కట్టబెట్టాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో ప్రారంభమైన కాంగ్రెస్‌ పార్టీ 85వ ప్లీనరీ ఇందుకు వేదికగా నిలిచింది. సీడబ్ల్యూసీ సభ్యుల ఎంపిక/ఎన్నిక విధానంపై మూడు రోజుల సదస్సులో తొలి రోజు స్టీరింగ్‌ కమిటీ విస్తృతంగా చర్చించిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ తెలిపారు.

వారిని అధ్యక్షుడే నామినేట్‌ చేయాలని 45 మంది సభ్యుల్లో దాదాపు అందరూ అభిప్రాయపడ్డట్టు చెప్పారు. ఈ నిర్ణయాన్ని ప్లీనరీలో ఏఐసీసీ, పీసీసీ ప్రతినిధులంతా ఏకగ్రీవంగా ఆమోదిస్తారని విశ్వాసం వెలిబుచ్చారు. కాంగ్రెస్‌ మాజీ ప్రధానులు, మాజీ అధ్యక్షులందరికీ ఇకపై సీడబ్ల్యూసీలో శాశ్వత సభ్యత్వం ఉండనుంది. లోక్‌సభ, రాజ్యసభల్లో కాంగ్రెస్‌ పక్ష నేతలు సీడబ్ల్యూసీ సభ్యులుగా కూడా వ్యవహరిస్తారు. అంతేగాక సీడబ్ల్యూసీ స్థానాల్లో 50 శాతం ఇకపై ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, మైనారిటీలు, యువతకు చెందుతాయి.

వీటితో పాటు పార్టీ నియమావళికి ప్రతిపాదించిన 16 సవరణలకు స్టీరింగ్‌ కమిటీ ఆమోదముద్ర వేసినట్టు జైరాం ప్రకటించారు. సీడబ్ల్యూసీలో 25 మంది సభ్యులుంటారు. పార్టీ చీఫ్, పార్లమెంటరీ పార్టీ నేత పోను మిగతా 23 మందిలో 12 మందిని ఎన్నుకుంటారు. 11 మంది నామినేట్‌ అవుతారు. ఈ ప్రక్రియను ఏకగ్రీవంగా నిర్వహించడం కాంగ్రెస్‌లో ఆనవాయితీ. అందుకు వీలుగా నిర్ణయాధికారాన్ని అధ్యక్షునికి స్టీరింగ్‌ కమిటీ కట్టబెడుతూ ఉంటుంది. 

సంక్షోభంలో వ్యవస్థలు: ఖర్గే 
కాంగ్రెస్‌ 85వ ప్లీనరీ రాయ్‌పూర్‌లో అట్టహాసంగా మొదలైంది. అధ్యక్షుని హోదాలో ఖర్గే ప్రారం¿ోపన్యాసం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పెను ప్రమాదంలో పడ్డాయంటూ ఆందోళన వెలిబుచ్చారు. పార్లమెంటరీ వ్యవస్థలన్నీ సంక్షోభంలో చిక్కడమే గాక రాజకీయ పార్టీల కార్యకలాపాలన్నింటిపైనా రాక్షస నిఘా పెరిగిపోయిందంటూ మండిపడ్డారు. ‘‘ఇలాంటి తరుణంలో పార్టీ ప్లీనరీ జరుపుకుంటున్నాం. గత ప్లీనరీలు పలు చరిత్రాత్మక నిర్ణయాలకు, మైలురాళ్లకు వేదికలయ్యాయి. ఈ ప్లీనరీని కూడా అలా పార్టీ చరిత్రలోనే చిరస్మరణీయంగా మలచుకుందాం’’ అంటూ కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు.

‘‘భారత్‌ జోడో యాత్ర ఉత్సాహాన్ని ముందుకు తీసుకెళ్దాం. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మనకు పెద్ద సవాలు. గొప్ప అవకాశం కూడా’’ అన్నారు. అంతకుముందు ఖర్గే సారథ్యంలో స్టీరింగ్‌ కమిటీ భేటీలో మూడు రోజుల సమావేశాల అజెండాను ఖరారు చేశారు. తొలి రోజు సమావేశాలకు సోనియాగాందీ, రాహుల్‌ గాం«దీ, ప్రియాంక గాంధీ వద్రా గైర్హాజరయ్యారు. సోనియా, రాహుల్‌ శుక్రవారం సాయంత్రానికి రాయ్‌పూర్‌ చేరుకున్నారు. 

నాలుగు అంశాలపై నిర్ణయాలు 
ప్లీనరీ అజెండా ఖరారుతో పాటు సీడబ్ల్యూసీ సభ్యులు ఎంపిక విధానాన్ని, పార్టీ నియమావళికి ప్రతిపాదించిన సవరణలను ఆమోదిస్తూ తొలి రోజు నిర్ణయాలు తీసుకున్నారు. వీటితో ఆరు కీలక తీర్మానాలకు ఆమోదముద్ర వేయడంపైనా ప్లీనరీలో నిర్ణయం జరగనుంది. 

కాంగ్రెస్‌ స్టీరింగ్‌ కమిటీ  ఆమోదించిన ముఖ్య సవరణలు... 
మండలం నుంచి రాష్ట్ర స్థాయి దాకా అన్ని పార్టీ కమిటీల్లోనూ 50 ఏళ్ల లోపువారికి 50 శాతం రిజర్వేషన్‌. 
►  ఏఐసీసీలోని అన్ని విభాగాల్లోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, మహిళలు, మైనారిటీ, యువతకు 50 శాతం రిజర్వేషన్‌.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement