
పరీక్షలను కూడా సమర్థవంతంగా నిర్వహించలేని నారా లోకేష్‌కు మంత్రిగా పనిచేసే అర్హత లేదని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు.
సాక్షి, తాడేపల్లి: పరీక్షలను కూడా సమర్థవంతంగా నిర్వహించలేని నారా లోకేష్‌కు మంత్రిగా పనిచేసే అర్హత లేదని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. లోకేష్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇది లీకేజీల ప్రభుత్వమంటూ రవిచంద్ర దుయ్యబట్టారు.
కడప జిల్లాలో టెన్త్ పేపర్ వాట్సాప్‌లో ఎలా వచ్చింది? అంటూ రవిచంద్ర ప్రశ్నించారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు ఎలా వెళ్తున్నాయి?. నారా లోకేష్ అసమర్థ మంత్రిగా నిలిచిపోయారు. బీఈడీ పరీక్షలను కూడా సరిగా నిర్వహించలేకపోయారు. అధికారులను సమర్థవంతంగా ఎందుకు వినియోగించలేకపోతున్నారు?. చంద్రబాబు ప్రభుత్వం అంటేనే లీకేజీల ప్రభుత్వంగా గుర్తింపు పొందింది. రామబ్రహ్మం 1997లో ఇంటర్ పేపర్ లీక్ చేశారు. ఆ తర్వాత నారాయణ సంస్థల్లోనూ పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయి. నారాయణ సంస్థలకే ర్యాంకులు రావాలని పేపర్లు లీక్ చేశారు. అప్పట్లో నారాయణ సంస్థల వైఎస్ ప్రిన్సిపాల్‌ని కూడా అరెస్టు చేశారు’’ అని రవిచంద్ర గుర్తు చేశారు.
‘2024లో చంద్రబాబు రాగానే మళ్లీ పేపర్లు లీకవుతున్నాయి. 6 లక్షల 19 వేల మంది విద్యార్థుల జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏనాడూ పేపర్ల లీకేజ్ అనేదే లేదు. నారాయణ సంస్థల ఉద్యోగిని ఇంటర్మీడియట్ బోర్డులో సభ్యునిగా పెట్టారు. తద్వారా ఇంటర్మీడియట్ బోర్డును తమ చేతుల్లోకి మంత్రి నారాయణ తీసుకున్నారు’’ అని రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.