మీది రెడ్‌ బుక్‌.. మాది గుడ్‌ బుక్‌: వైఎస్‌ జగన్‌ | YSRCP president YS Jagan Comments On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

మీది రెడ్‌ బుక్‌.. మాది గుడ్‌ బుక్‌: వైఎస్‌ జగన్‌

Published Thu, Oct 10 2024 5:09 AM | Last Updated on Thu, Oct 10 2024 8:02 AM

YSRCP president YS Jagan Comments On Chandrababu Govt

వివక్ష, పక్షపాత, కక్ష పూరిత పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం 

వైఎస్సార్‌సీపీ మంగళగిరి నియోజకవర్గ నేతల సమావేశంలో వైఎస్‌ జగన్‌

రెడ్‌బుక్‌ పెద్ద విషయమా? మేమైతే గుడ్‌ బుక్‌ రాస్తున్నాం 

ఇక్కట్లు పడుతున్న పార్టీ శ్రేణులకు అండగా ఉంటాం.. మేలు చేసిన వారికి అధికారంలోకి రాగానే మంచి చేస్తాం 

కష్టపడిన వారికి తప్పకుండా అవకాశాలు, ప్రమోషన్లు.. అర్హతే ప్రామాణికంగా అందరికీ మంచి చేశాం 

4 నెలల్లోనే మొత్తం యూటర్న్‌  

పథకాల అమలు లేదు.. మహిళలకు భద్రతా లేదు 

కష్టాలు ఎల్లకాలం ఉండవు.. వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే

ఇప్పుడు పరిస్థితులు ఏంటో మీరే చూడండి. కేవలం నాలుగు నెలల్లోనే మొత్తం యూటర్న్‌. ప్రతి అడుగులోనూ, ప్రతి విషయంలోనూ తిరోగమనమే కనిపిస్తోంది. ప్రతి చోటా వివక్ష, పక్షపాతం కనిపిస్తున్నాయి. ప్రతి ఇంట్లోనూ దీనిపై చర్చ జరుగుతోంది. ‘జగన్‌ పలావు పెట్టాడు. బాబు బిర్యానీ పెడతానన్నాడు. ఇప్పుడు పలావూ పోయింది. బిర్యానీ పోయింది’ అనే చర్చ జరుగుతోంది.

ఇప్పుడు పథకాలు అమలు కాకపోగా, వ్యవస్థలన్నీ పతనం అవుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ అటకెక్కింది. బిల్లులు చెల్లించడం లేదు. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల బిల్లులు దాదాపు రూ.2,300 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని పేషెంట్‌ ఆస్పత్రికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎగరగొట్టారు. ఒకేసారి 17 మెడికల్‌ కాలేజీల పనులు మొదలుపెట్టగా, ఇప్పటికే 5 కాలేజీలు ప్రారంభమయ్యాయి. మిగిలిన 5 కాలేజీలు ఈ ఏడాది ప్రారంభం కావాల్సి ఉంది. అన్నీ వెనుకడుగే. ప్రభుత్వం ఎందుకు ఉందో అర్థం కావడం లేదు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు ఉంటాయి. ఆ కష్టాల నుంచే నాయకులు పుడతారు. కేసులు పెడతారు. జైళ్లకు పంపిస్తారు. నన్ను 16 నెలలు జైల్లో పెట్టి తీవ్రంగా వేధించారు. ఇంతకంటే దారుణంగా ఎవరినీ వేధించి ఉండరు. అయినా ప్రజల ఆశీస్సులతో మనం ముందడుగు వేశాం. ప్రజల ఆశీస్సులతో సీఎం అయ్యాను. కష్టాలు ఎక్కువ కాలం ఉండవు. వచ్చేది మన ప్రభుత్వమే. 
– వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్‌ అంటూ ఎప్పుడూ లేని దుష్ట సంప్రదాయాన్ని తీసుకొచ్చింది. వివక్ష, పక్షపాత, కక్ష పూరిత పాలన సాగిస్తోంది. రెడ్‌బుక్‌ అనేది పెద్ద విషయమా? మేమైతే గుడ్‌బుక్‌ రాసుకోవడం మొదలు పెట్టాం. పార్టీకి మంచి చేసిన వారిని, కష్టపడే వారి పేర్లన్నీ రాసుకుంటున్నాం. వారందరికీ తప్పకుండా అవకాశాలు, ప్రమోషన్లు ఉంటాయి’ అని వైఎస్సార్‌­సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలేనని.. ఆ మోసం వల్ల ప్రజల కోపం నుంచి పుట్టే ఓటు చంద్రబాబుకు సింగిల్‌ డిజిట్‌ కూడా రాని పరిస్థితి తెస్తుందన్నారు. 

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై వారికి దిశా నిర్దేశం చేశారు. ‘మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. మితిమీరిన అధికార దుర్వినియోగంతో మన కార్యకర్తలకు నష్టం చేస్తున్నప్పుడు కచ్చితంగా భరోసా ఇవ్వాలి. వారికి పార్టీ తోడుగా ఉంటుందనే విశ్వాసం కల్పించాలి. ఆ ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేశాం.  

పార్టీ ప­రంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాం. అన్నింటినీ తట్టుకుని పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటారని భావించి వేమారెడ్డిని ఇన్‌ఛార్జిగా నియమించాం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఎలా పా­లన సాగిస్తుందో మీ అందరికీ తెలుసు. నాలుగు నెలలుగా రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడే మనిషి వ్యక్తిత్వం బయటకు వస్తుంది. చీకటి తర్వాత కచ్చితంగా వెలుతురు వస్తుంది’ అని చెప్పా­రు. వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

మన మంచి ప్రతి ఇంట్లో ఉంది  
⇒ 2019 నుంచి 2024 వరకు ప్రతి ఇంటికీ మనం మంచి చేశాం. ఆ మంచి ప్రతి ఇంట్లోనూ బతికే ఉంది. అందుకే ప్రతి ఇంటికీ మనం గర్వంగా తలెత్తుకుని వెళ్లగలం. రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా పాలన చేస్తూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాం. గతంలో మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు పెద్ద డాక్యుమెంట్‌ తయారు చేసి, ఎన్నికలవ్వగానే చెత్తబుట్టలో వేసే సంప్రదాయం. కానీ మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అన్నదానికి అర్థం తీసుకొచ్చిన పాలన మాత్రం కేవలం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది.  

⇒ మేనిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించి అందులో ఇచ్చిన ప్రతి హామీని.. గతంలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, చూ­డని విధంగా బడ్జెట్‌తో పాటు సంక్షేమ క్యాలెండర్‌ కూడా విడుదల చేశాం. ఏ నెలలో ఏ పథకం వస్తుందో ముందుగానే చెప్పి.. ఆ ప్రకారం ప్రతి నెలలో క్రమం తప్పకుండా బటన్‌ నొక్కి పథకాలు అమలు చేశాం. ఇది కేవలం ఐదేళ్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పాలనలోనే జరిగింది. గతంలో రాష్ట్రంలోనే కాదు.. బహుశా దేశంలోనే ఈ తరహాలో క్యాలెండర్‌ ద్వారా పథకాలు అమలు చేసిన చరిత్ర లేదు.  

విప్లవాత్మక మార్పులు తెచ్చాం  
⇒ స్కూళ్లు, ఆస్పత్రులను సమూలంగా మార్చాం. మంచి వైద్యాన్ని గ్రామాలకే తీసుకువచ్చాం. ఇంగ్లిష్‌ మీడియం చదువులు, టోఫెల్‌ క్లాసులు, ప్రభుత్వ బడుల్లో డిజిటల్‌ ప్యానెల్స్, ఎనిమిదో తరగతి పిల్లల చేతుల్లో ట్యాబ్‌ల వంటి మార్పులు చేశాం. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో గొప్ప మార్పులు తెచ్చాం. ఉచిత పంటల బీమా అమలు చే­శాం. రైతులకు ఈ–క్రాప్‌ చేశాం. దళారీ వ్యవస్థ లేకుండా ఆర్బీకేల ద్వారా రైతుల వద్ద నుంచి కొనుగోళ్లు చేపట్టాం.  

⇒ చివరకు పాలనలో సైతం మార్పులు తెచ్చాం. పాలన అంటే ప్రజల వద్దకు మాత్రమే కాదు.. ప్రజల ఇంటికే పంపించే కార్యక్రమం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే జరిగింది. వివక్ష లేకుండా, రాజకీయాలు చూడకుండా పథకాలు ఇచ్చాం. కేవలం అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని.. మనకు ఓటు వేయని వారికి కూడా అడగకుండా పథకాలు ఇచ్చాం. ప్రతి ఇంటి గడప వద్దకే పెన్షన్, రేషన్‌ సరుకులతో పాటు అన్ని పథకాలు అందించాం.  

⇒ దిశ యాప్‌ ద్వారా అక్కచెల్లెమ్మలకు భద్రత కల్పించాం. ఒకవేళ వారు ఇబ్బందుల్లో ఉంటే దిశ యాప్‌ బటన్‌ నొక్కిన 10 నిమిషాల్లోపే పోలీసులు వచ్చి భద్రత కల్పించేలా చేశాం. ఇవన్నీ గతం. ఇవాళ ఏ ఒక్కటీ అమలు కావడం లేదు. అక్కచెల్లెమ్మలకు భద్రత కరువైంది. 

పార్టీని మరింత బలోపేతం చేద్దాం  
సంస్థాగతంగా పార్టీ అత్యంత బలంగా ఉండాలి. గ్రామ స్థాయి నుంచి బూత్‌ కమిటీల ఏర్పాటు జరగాలి. ఆ స్థాయిలో పార్టీ ఏకం కావాలి. 

మన కార్యకర్తలను, అభిమానులను ఏకం చేయాలి. వారందరి ద్వారా బలమైన పార్టీ నిర్మాణం జరగాలి. ఆ తర్వాత ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మనం సన్నద్ధంగా ఉంటాం. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే.

ఈ ఫలితాలతో ప్రజాభిప్రాయం గందరగోళం
ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని గందరగోళానికి గురి చేస్తున్నాయనడానికి మరో తార్కాణం హర్యానా ఎన్నికల ఫలితాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. హర్యానా ఎన్నికల ఫలితాలపై ‘ఎక్స్‌’ వేదికగా బుధవారం ఆయన స్పందించారు. ‘హర్యానా, ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు భిన్నంగా లేవు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 

మనలాంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాదు.. దృఢంగా ఉన్నట్లు కన్పించాలి. ఈ రెండింటినీ నిర్ధారించడానికి ఏకైక మార్గం పేపర్‌ బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించడమే. యూఎస్‌ఏ, యూకే, కెనడా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, నార్వే, డెన్మార్క్‌తో సహా చాలా అభివృద్ధి చెందిన దేశాలు పేపర్‌ బ్యాలెట్‌ను ఉపయోగిస్తున్నాయి. 

మనం ప్రపంచంలోని ఇతర దేశాలలో మార్పులు చూసి పేపర్‌ బ్యాలెట్‌ వైపు వెళ్లే సమయం ఇది. బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే ఓటర్ల విశ్వాసాన్ని పెంచుతుంది. ఇలా విశ్వాసాన్ని నింపేందుకు చట్టసభ సభ్యులు ముందుకు రావాలి’ అని పిలుపునిచ్చారు. ఈ మేరకు దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలను ట్యాగ్‌ చేస్తూ వైఎస్‌ జగన్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు.  

సాకులు చూపకుండా పథకాల అమలు  
⇒ పథకాల అమలులో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. పథకాలు అమలు చేయకుండా ఉండేందుకు చాలా కారణాలు కనిపించాయి. గతంలో చంద్రబాబు చేసిన అప్పులు, మన హయాంలో చేసిన వాటి కన్నా చాలా ఎక్కువ. ఆ అప్పుల బరువు మనం మోశాం. కోవిడ్‌ లాంటి మహా సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం. రెండేళ్ల పాటు కోవిడ్‌తో యుద్ధం చేస్తున్న సమయంలో అనూహ్యంగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు కూడా తగ్గిపోయాయి. మరోవైపు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఇలాంటి అనేక పరిస్థితులు చూశాం.

⇒ అయినా ఏరోజూ కూడా సాకులు చూపకుండా పథకాలు అమలు చేశాం. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్కటీ చేయాల్సిన ధర్మం మన మీద ఉందని నమ్మి అన్నీ నడిపించాం. చిరునవ్వుతోనే పాలన సాగించి, చెప్పిన ప్రతి మాట నెరవేర్చుతూ, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా పాలన చేస్తూ మార్పులు తీసుకువచ్చాం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement