
చంద్రబాబు విధ్వంసం అంతా ఇంతా కాదు: వైఎస్ జగన్ మండిపాటు
విద్య, వైద్యం, వ్యవసాయం.. అన్ని రంగాలు నిర్వీర్యం
రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్‌బుక్ రాజ్యాంగం
వీటన్నింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి
వారికి అండగా కార్యక్రమాలు చేపట్టాలి
వాటి ద్వారానే పనితీరు బయటపడుతుంది
ఇందులో పార్టీ జిల్లా అధ్యక్షులది కీలక బాధ్యత
మీ జిల్లాల్లో పార్టీ ఓనర్‌షిప్ మీదే
ప్రజా సంబంధిత అంశాల్లో తక్షణం చొరవ చూపాలి
ఒకరి ఆదేశాల కోసం ఎదురుచూడొద్దు
మీకు మీరుగా స్వచ్ఛందంగా కదలాలి..
నియోజకవర్గ ఇన్‌చార్జిని స్వయంగా కలవాలి
సమాజంలో గొంతులేని వర్గాలకు ఎల్లప్పుడూ బాసటగా నిలిచేది మనమే
పార్టీ జిల్లా అధ్యక్షులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం
రాష్ట్రంలో ఇప్పుడు ఏ పంటకూ మద్దతు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వివిధ జిల్లాల్లో కష్టాలు ఎదుర్కొంటున్నారు. మనం వారి తరఫున నిలబడి గట్టిగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. అన్న దాతలకు ఆయా జిల్లాల్లో మీరంతా అండగా నిలిచి వారి డిమాండ్ల సాధనకు బలంగా ఉద్యమించాలి.
– వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు అన్నింటా ఘోర వైఫల్యం చెందిందని.. యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని.. అంతులేని అవినీతి జరుగుతోందని.. వీటన్నింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ జిల్లాల అధ్యక్షులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదని మండిపడ్డారు. విద్య, వైద్యం, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాల్లో విధ్వంసమే కొనసాగుతోందన్నారు.
మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. ప్రజల పక్షాన గట్టిగా పోరాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా అధ్యక్షులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లాల అధ్యక్షులతోపాటు రీజినల్ కో ఆర్డినేటర్లు, ఎంపీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే...
ఎల్లప్పుడూ బాసటగా నిలిచేది మనమే..
చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాల వల్ల కష్టాల్లో కూరుకుపోయిన ప్రజలకు అండగా నిలబడాలి. ఆ కార్యక్రమాలు రాష్ట్ర స్థాయి దృష్టిని ఆకర్షిస్తాయి. వాటి ద్వారా మీ పనితీరు కూడా బయటపడుతుంది. ఈ ప్రక్రియలో పార్టీ జిల్లా అధ్యక్షులది చాలా కీలక బాధ్యత. సమాజంలో గొంతులేని వారికి బాసటగా నిలిచేది ఎప్పుడైనా మనమే. ప్రతి సమస్యలోనూ మనం బాధితులకు తోడుగా ఉంటాం. తొలి నుంచి అలా నిలుస్తోంది, ఆ పని చేస్తోంది ఒక్క వైఎస్సార్‌సీపీనే.
అక్టోబర్‌లోగా బూత్ కమిటీలు
మే నెలాఖరులోపు పార్టీ మండల కమిటీలు ఏర్పాటు కావాలి. జూన్, జూలైల్లో గ్రామస్థాయి, మున్సిపాల్టీల్లో డివిజన్ కమిటీలను పూర్తి చేయాలి. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులో బూత్ కమిటీలన్నీ ఏర్పాటవ్వాలి. ఇదే లక్ష్యంగా మీరంతా పని చేయాలి. అలాగే పార్టీని జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ మరింత బలంగా తీసుకెళ్లే బాధ్యత కూడా మీపై ఉంది.
ఆ దిశలో పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగాలి. పార్టీలో జిల్లా అధ్యక్షుల పాత్ర చాలా కీలకం. గ్రామస్థాయి బూత్ కమిటీలు, గ్రామ కమిటీల ఏర్పాటు అనేది అత్యంత కీలక విధుల్లో ఒకటి. అందుకే పార్టీలో సమర్థులు ఎవరు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు లీడ్ చేయగలరు? అనేది ఆలోచన చేసి మీకు బాధ్యతలు అప్పగించాం.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
మీరే పార్టీ.. పార్టీయే మీరు
మీ జిల్లాల్లో పార్టీ మీద మీకు పట్టు ఉండాలి. పార్టీ బలోపేతం కోసం గట్టిగా కృషి చేయాలి. బాధ్యతల నుంచే అధికారం వస్తుంది. పార్టీకి జిల్లాల్లో మీరే సర్వం. మీరే పార్టీ.. పార్టీయే మీరు. జిల్లాల్లో అన్ని స్థానాల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మీది. మనసా వాచా కర్మణా అదే తలంపుతో పార్టీని నడపాలి. దీనికోసం ఏం చేయాలన్న దానిపై వ్యూహంతో కదలండి. గట్టిగా పని చేయండి. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ప్రతి కమిటీ బలంగా ఉండాలి. ఏదైనా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పనితీరు బాగోలేకపోతే పిలిచి చెప్పగలగాలి.
అప్పటికీ పరిస్థితి మారకపోతే ప్రత్యామ్నాయం చూడాలి. అక్కడా మీ భాగస్వామ్యమే కీలకం. పార్టీలో ఎక్కడైనా ఇద్దరి మధ్య వివాదం తలెత్తితే వారిని పిలిచి సమన్వయం చేయాల్సిన బాధ్యత మీది. మీ పరిధిలో జిల్లాలో అన్ని స్థానాలు గెలిపించాల్సిన బాధ్యత మీది. అందుకే ఆ బాధ్యత, అధికారం.. రెండూ తీసుకోండి. మీరు సమర్థులని భావించి ఈ బాధ్యతలు అప్పగించాం. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయం చేయడం, జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ కమిటీల నిర్మాణం మీ ప్రధాన బాధ్యత. అలాగే ప్రజా సంబంధిత అంశాల్లో చురుగ్గా ఉండాలి.
నాయకత్వ ప్రతిభ బయటపడేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయట పడుతుంది. భారీ లక్ష్యం ఉన్నప్పుడే బ్యాట్స్‌మన్ ప్రతిభ బయట పడుతుంది. అప్పుడే ఆ బ్యాట్స్‌మన్ ప్రజలకు ఇష్టుడు అవుతాడు. ఇది కూడా అంతే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసే పనుల వల్ల ఎలివేట్ అవుతాం. తద్వారా ప్రజల దగ్గర, పార్టీలోనూ గౌరవం పెరుగుతుంది. ఇమేజీ కూడా పెరుగుతుంది.
మన పనితీరు వల్లే మన్ననలు పొందగలుగుతాం. అందరూ ధోనీల్లా తయారు కావాలి. జిల్లాల్లో ఏం జరిగినా మీరు ప్రజల తరఫున నిలబడాలి. చురుగ్గా కార్యక్రమాలు చేయాలి. ప్రజా వ్యతిరేక అంశాల మీద గట్టిగా పోరాటం చేయాలి. లేదంటే పార్టీపరంగా మనం అవకాశాలను కోల్పోయినట్టే.
ప్రజలకు మరింత చేరువవుదాం
బాధితులకు మనం ఎప్పుడూ అండగా ఉండాలి. మనమంతా రాజకీయ నాయకులం. మన జీవితాలను రాజకీయాల కోసం కేటాయించామనే విషయం మరిచిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకూడదు. ప్రతిపక్షంగా మనకు వచ్చిన అవకాశాలను వదిలి పెట్టకూడదు. జిల్లా స్థాయిలో ప్రజా సంబంధిత అంశాలను మీరు బాగా వెలుగులోకి తీసుకొస్తేనే ప్రజలకు మరింత దగ్గరవుతాం.
మనం అధికారంలోకి వస్తేనే ప్రజలకు మరింత మంచి చేయగలం. ప్రజలకు మరింత మంచి చేయాలన్న తపన, తాపత్రయం ఉంది కాబట్టే రాజకీయాలు చేస్తున్నాం. నాన్నగారు చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలనుకున్నాను కాబట్టే నేను రాజకీయాలు చేస్తున్నాను. అలాగే ప్రతి జిల్లాల్లో మీ సేవల గురించి మాట్లాడుకోవాలి.
ఏడాదిలోపే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
సాధారణంగా రెండు, మూడేళ్లయితే గానీ ప్రభుత్వ వ్యతిరేకత బయటకు కనిపించదు. కానీ ఏడాదిలోపే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉంది. అందుకే యుద్ధ ప్రాతిపదికన కమిటీల నిర్మాణం పూర్తి చేయాలి. దీని తర్వాత పార్టీ పరంగా మీకూ, నాకూ పూర్తి స్థాయిలో పని ఉంటుంది. అందరం కలసికట్టుగా పార్టీ కార్యక్రమాలను బలంగా ముందుకు తీసుకెళ్లాలి.
అందుకే పార్టీ పరంగా నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. ఈ ప్రక్రియలో గ్రామస్థాయిలో కూడా కమిటీలు, బూత్ కమిటీలు ఏర్పాటు అయితేనే మనం పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉన్నట్లు అవుతుంది. ప్రతి జిల్లాలో బలంగా పార్టీ నిర్మాణం ద్వారా దాదాపు 12 వేల మంది మన పార్టీ కార్యక్రమాల కోసం మీకు అందుబాటులో ఉంటారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపు 1,500 మంది అందుబాటులో ఉంటారు.
ప్రజా సమస్యలపై సమన్వయంతో పోరాటం
చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రాష్ట్రంలో ఆయన చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. విద్య, వైద్యం, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాల్లోనూ విధ్వంసమే కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో మీ జిల్లాలో పార్టీ ఓనర్‌షిప్ మీదే. ప్రజా సంబంధిత అంశాల్లో మరింత చొరవ చూపాలి. ఒకరి ఆదేశాల కోసం ఎదురు చూడొద్దు. మీకు మీరుగా స్వచ్ఛందంగా కదలాలి. నియోజకవర్గ ఇన్‌చార్జిని స్వయంగా కలవాలి. వారితో కలసి మొదట
-పార్టీ జిల్లా అధ్యక్షులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం