రోజుకు 10 గ్రాములు చాలు! | NIN scientist Dr Ahmed Ibrahim Exclusive interview with Sakshi | Sakshi
Sakshi News home page

రోజుకు 10 గ్రాములు చాలు!

Published Mon, Mar 24 2025 1:20 AM | Last Updated on Mon, Mar 24 2025 4:42 PM

NIN scientist Dr Ahmed Ibrahim Exclusive interview with Sakshi

నెయ్యిలో కొవ్వు పదార్థాలే ఎక్కువ.. విటమిన్ల మోతాదు తక్కువే 

మొత్తంగా కొవ్వు పదార్థాలు రోజుకు 30 గ్రాములకు మించకూడదు 

ఆవు నెయ్యిలో గేదె నెయ్యి కంటే తక్కువ శాతం కొవ్వు 

‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ అహ్మద్‌ ఇబ్రహీం

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌: అమ్మ చేతి గోరు ముద్దను నెయ్యి కమ్మదనం లేకుండా ఊహించలేం. నేతి రుచి తగలకపోతే భోజనమైనా, అల్పాహారమైనా, పిండి వంటలైనా సంతృప్తికరం, సంపూర్ణమూ కావంటే అతిశయోక్తి కాదు. వివిధ రకాల పచ్చళ్లు, పొడులకు కాస్త నెయ్యి జోడించి తింటే ఆ మజాయే వేరు. 3 వేల ఏళ్ల క్రితం నుంచే నెయ్యి వాడకం ఉందని చరిత్ర చెబుతోంది. అయితే నెయ్యి వినియోగంపై భిన్నాభిప్రాయాలున్నాయి.

మంచిదని కొందరంటుంటే, మితిమీరి వాడితే రక్తనాళాల్లో అవరోధాలేర్పడతాయని కొందరంటున్నారు. ఇంతకీ నిపుణులేమంటున్నారు? భారతీయులు సగటున రోజుకు 10 గ్రాముల వరకు నెయ్యి/వెన్న తీసుకోవచ్చని హైదరాబాద్‌లోని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) అనుబంధ సంస్థ జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌)లో లిపిడ్‌ కెమిస్ట్రీ డివిజన్‌ సైంటిస్ట్‌ (జి)గా ఉన్న డాక్టర్‌ అహ్మద్‌ ఇబ్రహీం (Dr. Ahmed Ibrahim) తెలిపారు. ‘సాక్షి’ ఇంటర్వ్యూ వివరాలు ఆయన మాటల్లోనే..

ఔషధ విలువలపై పరిశోధనలు జరగలేదు.. 
నెయ్యిలో ఎక్కువ వరకు కొవ్వు పదార్థాలే ఉంటాయి. విటమిన్‌ ఎ, ఇ, కె కూడా కొంతవరకు ఉంటాయి కానీ, అవి పరిగణనలోకి తీసుకోదగినంత ఎక్కువగా ఉండవు. అందుకని ఈ విటమిన్లను పొందటం కోసం నెయ్యిని వనరుగా చూడకూడదు. ఆవు నెయ్యిలో గేదె నెయ్యి కంటే తక్కువ శాతం కొవ్వు ఉంటుంది.

మోనో అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్‌ అనే ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థం ఆవు నెయ్యిలో కొంచెం ఎక్కువగా ఉంటుంది.. అంతే తేడా. నెయ్యిలో ఔషధ విలువల గురించి ఎన్‌ఐఎన్‌లో పరిశోధనలేమీ చెయ్యలేదు. అలాగే వేసవిలో ఎంత నెయ్యి తీసుకోవాలి? అనే విషయంపై కూడా పరిశోధనలేమీ జరగలేదు. అయితే నెయ్యిని నిర్దేశిత మోతాదుకు మించకుండా తీసుకోవాలి.  

నెయ్యిలో పోషకాలు (100 గ్రాములకు) 
శక్తి – 870 కిలోకేలరీలు 
పిండి పదార్థం– 0 గ్రా. 
కొవ్వు – 99.5 గ్రా. 
శాచ్యురేటెడ్‌ ఫ్యాట్‌ – 61.9 గ్రా. 
మోనో శాచ్యురేటెడ్‌ ఫ్యాట్‌ – 28.7 గ్రా.  
పాలీ అన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాట్‌ – 3.69 గ్రా.  
మాంసకృత్తులు – 0.3 గ్రా.  
కొలెస్ట్రాల్ – 256 మిల్లీ గ్రాములు 
కాల్షియం – 4 మిల్లీ గ్రాములు  

వేర్వేరు వంట నూనెలు మంచిది 
ఒకరు సగటున రోజుకు సుమారు 2,000 కిలో కేలరీల ఆహారం తీసుకోవాలి. అందులో 30% కేలరీల మేరకు కొవ్వు పదార్థాలు ఉండాలి. అందులో ‘ఇన్‌విజిబుల్‌ ఫ్యాట్‌’సగం, ‘విజిబుల్‌ ఫ్యాట్‌’సగం ఉండాలి. మనం రోజూ తినే అనేక ఆహార పదార్థాల్లో అంతర్లీనంగా కలిసి ఉండే కొవ్వు పదార్థాలనే ‘ఇన్‌విజిబుల్‌ ఫ్యాట్‌’అంటున్నాం. 2,000 కిలో కేలరీల ఆహారం తీసుకునే వ్యక్తి రోజుకు సుమారు 30 గ్రాముల ‘విజిబుల్‌ ఫ్యాట్‌’అంటే.. వంట నూనెలు, నెయ్యి/వెన్న వంటివి తీసుకోవచ్చు.

వీటిలో మూడింట ఒక వంతు మాత్రమే నెయ్యి/వెన్న ఉండాలి. వంట నూనెలు ఒకే రకం కాకుండా అనేక రకాలను తీసుకోవటం చాలా మంచిది. ఒక్కో నూనెలో ఒక్కో రకం ఫ్యాటీ యాసిడ్‌ పాళ్లు అధికంగా ఉంటాయి. అందుకే అనేక రకాల నూనెలను రోజుకు 20 గ్రాముల వరకు తీసుకోవచ్చు. 10 గ్రాములకు మించకుండా నెయ్యి / వెన్న వంటి శాచ్యురేటెడ్‌ ఫ్యాట్‌ అధికంగా ఉన్న పదార్థాలను తీసుకోవచ్చు. అయితే, 30 గ్రాముల వరకు నూనెలు తీసుకునే వారు కూడా నెయ్యి తప్పకుండా తీసుకోవాలనేమీ లేదు. మొత్తం కలిపి కొవ్వు పదార్థాలు రోజుకు 30 గ్రాములకు మించకుండా తీసుకోవాలి. దీన్ని ఎన్‌ఐఎన్‌ విడుదల చేసిన ‘భారతీయులకు ఆహార సంబంధ మార్గదర్శక సూత్రాలు’లోనూ పొందుపరిచాం.

పిల్లలు ఇలా తీసుకోవాలి 
పిల్లలు వారి వయసు, బరువు ఆధారంగా ఎన్ని కేలరీలను రోజువారీ ఆహారం తీసుకోవాలో ఎన్‌ఐఎన్‌ నిర్దేశించింది.

10–12 ఏళ్ల మగ పిల్లలు రోజుకు 2,200 కేలరీల ఆహారం తినాలి. వీరు 24 గ్రాముల నూనెలు, 12 గ్రాముల నెయ్యి/వెన్న వాడొచ్చు.  
10–12 ఏళ్ల ఆడ పిల్లలు రోజుకు 2,000 కేలరీల ఆహారం తినాలి. 22 గ్రాముల నూనెలు, 11 గ్రాముల నెయ్యి/వెన్న వాడొచ్చు. 
13–15 ఏళ్ల మగ పిల్లలు రోజుకు 2,800 కేలరీల ఆహారం తినాలి. వీరు 30 గ్రాముల నూనెలు, 15 గ్రాముల నెయ్యి/వెన్న వాడొచ్చు.  
13–15 ఏళ్ల ఆడ పిల్లలు రోజుకు 2,400 కేలరీల ఆహారం తినాలి. 27 గ్రాముల నూనెలు, 13 గ్రాముల నెయ్యి/వెన్న వాడొచ్చు. 
16–18 ఏళ్ల మగ పిల్లలు రోజుకు 3,300 కేలరీల ఆహారం తినాలి. వీరు 37 గ్రాముల నూనెలు, 18 గ్రాముల నెయ్యి/వెన్న వాడొచ్చు.  
16–18 ఏళ్ల ఆడ పిల్లలు రోజుకు 2,500 కేలరీల ఆహారం తినాలి. వీరు 28 గ్రాముల నూనెలు, 13 గ్రాముల నెయ్యి వాడొచ్చు.

వ్యాయామం చేసే వారికి నెయ్యితో మేలు! 
నెయ్యి మన శరీరంలో ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది. మెదడును శక్తిమంతం చేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుంది. వాతాన్ని, పైత్యాన్ని, కఫాన్ని సమస్థితిలో ఉంచుతుంది. చర్మానికి కాంతినిస్తుంది. లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. నేతిలోని బుటిరేట్‌ జఠరాగ్నిని ప్రజ్వలింపజేస్తుంది. విష దోషాల్ని, పేగుల్లో పుళ్లు, వాపుల్ని, గడ్డల్ని నివారిస్తుంది. నెయ్యి తినే అలవాటున్న వారిలో పేగు కేన్సర్‌ తక్కువ. భారతీయ గోసంతతి విదేశీ గోసంతతి కన్నా భిన్నమైనది. మన ఆవుల వెన్నలో అపకారక ఎల్‌డీఎల్‌ కొవ్వు కన్నా ఉపకారక హెచ్‌డీఎల్‌ కొవ్వు ఎక్కువగా ఉంటుంది. బాగా వ్యాయామం చేసే వారికి నెయ్యి మేలే చేస్తుంది.  
– డా. జీవీ పూర్ణచందు ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement