Childrens food
-
రోజుకు 10 గ్రాములు చాలు!
సాక్షి, స్పెషల్ డెస్క్: అమ్మ చేతి గోరు ముద్దను నెయ్యి కమ్మదనం లేకుండా ఊహించలేం. నేతి రుచి తగలకపోతే భోజనమైనా, అల్పాహారమైనా, పిండి వంటలైనా సంతృప్తికరం, సంపూర్ణమూ కావంటే అతిశయోక్తి కాదు. వివిధ రకాల పచ్చళ్లు, పొడులకు కాస్త నెయ్యి జోడించి తింటే ఆ మజాయే వేరు. 3 వేల ఏళ్ల క్రితం నుంచే నెయ్యి వాడకం ఉందని చరిత్ర చెబుతోంది. అయితే నెయ్యి వినియోగంపై భిన్నాభిప్రాయాలున్నాయి.మంచిదని కొందరంటుంటే, మితిమీరి వాడితే రక్తనాళాల్లో అవరోధాలేర్పడతాయని కొందరంటున్నారు. ఇంతకీ నిపుణులేమంటున్నారు? భారతీయులు సగటున రోజుకు 10 గ్రాముల వరకు నెయ్యి/వెన్న తీసుకోవచ్చని హైదరాబాద్‌లోని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) అనుబంధ సంస్థ జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్)లో లిపిడ్ కెమిస్ట్రీ డివిజన్ సైంటిస్ట్ (జి)గా ఉన్న డాక్టర్ అహ్మద్ ఇబ్రహీం (Dr. Ahmed Ibrahim) తెలిపారు. ‘సాక్షి’ ఇంటర్వ్యూ వివరాలు ఆయన మాటల్లోనే..ఔషధ విలువలపై పరిశోధనలు జరగలేదు.. నెయ్యిలో ఎక్కువ వరకు కొవ్వు పదార్థాలే ఉంటాయి. విటమిన్ ఎ, ఇ, కె కూడా కొంతవరకు ఉంటాయి కానీ, అవి పరిగణనలోకి తీసుకోదగినంత ఎక్కువగా ఉండవు. అందుకని ఈ విటమిన్లను పొందటం కోసం నెయ్యిని వనరుగా చూడకూడదు. ఆవు నెయ్యిలో గేదె నెయ్యి కంటే తక్కువ శాతం కొవ్వు ఉంటుంది.మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అనే ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థం ఆవు నెయ్యిలో కొంచెం ఎక్కువగా ఉంటుంది.. అంతే తేడా. నెయ్యిలో ఔషధ విలువల గురించి ఎన్ఐఎన్లో పరిశోధనలేమీ చెయ్యలేదు. అలాగే వేసవిలో ఎంత నెయ్యి తీసుకోవాలి? అనే విషయంపై కూడా పరిశోధనలేమీ జరగలేదు. అయితే నెయ్యిని నిర్దేశిత మోతాదుకు మించకుండా తీసుకోవాలి. నెయ్యిలో పోషకాలు (100 గ్రాములకు) ⇒ శక్తి – 870 కిలోకేలరీలు ⇒ పిండి పదార్థం– 0 గ్రా. ⇒ కొవ్వు – 99.5 గ్రా. ⇒ శాచ్యురేటెడ్ ఫ్యాట్ – 61.9 గ్రా. ⇒ మోనో శాచ్యురేటెడ్ ఫ్యాట్ – 28.7 గ్రా. ⇒ పాలీ అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్ – 3.69 గ్రా. ⇒ మాంసకృత్తులు – 0.3 గ్రా. ⇒ కొలెస్ట్రాల్ – 256 మిల్లీ గ్రాములు ⇒ కాల్షియం – 4 మిల్లీ గ్రాములు వేర్వేరు వంట నూనెలు మంచిది ఒకరు సగటున రోజుకు సుమారు 2,000 కిలో కేలరీల ఆహారం తీసుకోవాలి. అందులో 30% కేలరీల మేరకు కొవ్వు పదార్థాలు ఉండాలి. అందులో ‘ఇన్విజిబుల్ ఫ్యాట్’సగం, ‘విజిబుల్ ఫ్యాట్’సగం ఉండాలి. మనం రోజూ తినే అనేక ఆహార పదార్థాల్లో అంతర్లీనంగా కలిసి ఉండే కొవ్వు పదార్థాలనే ‘ఇన్విజిబుల్ ఫ్యాట్’అంటున్నాం. 2,000 కిలో కేలరీల ఆహారం తీసుకునే వ్యక్తి రోజుకు సుమారు 30 గ్రాముల ‘విజిబుల్ ఫ్యాట్’అంటే.. వంట నూనెలు, నెయ్యి/వెన్న వంటివి తీసుకోవచ్చు.వీటిలో మూడింట ఒక వంతు మాత్రమే నెయ్యి/వెన్న ఉండాలి. వంట నూనెలు ఒకే రకం కాకుండా అనేక రకాలను తీసుకోవటం చాలా మంచిది. ఒక్కో నూనెలో ఒక్కో రకం ఫ్యాటీ యాసిడ్ పాళ్లు అధికంగా ఉంటాయి. అందుకే అనేక రకాల నూనెలను రోజుకు 20 గ్రాముల వరకు తీసుకోవచ్చు. 10 గ్రాములకు మించకుండా నెయ్యి / వెన్న వంటి శాచ్యురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉన్న పదార్థాలను తీసుకోవచ్చు. అయితే, 30 గ్రాముల వరకు నూనెలు తీసుకునే వారు కూడా నెయ్యి తప్పకుండా తీసుకోవాలనేమీ లేదు. మొత్తం కలిపి కొవ్వు పదార్థాలు రోజుకు 30 గ్రాములకు మించకుండా తీసుకోవాలి. దీన్ని ఎన్ఐఎన్ విడుదల చేసిన ‘భారతీయులకు ఆహార సంబంధ మార్గదర్శక సూత్రాలు’లోనూ పొందుపరిచాం.పిల్లలు ఇలా తీసుకోవాలి పిల్లలు వారి వయసు, బరువు ఆధారంగా ఎన్ని కేలరీలను రోజువారీ ఆహారం తీసుకోవాలో ఎన్ఐఎన్ నిర్దేశించింది.⇒10–12 ఏళ్ల మగ పిల్లలు రోజుకు 2,200 కేలరీల ఆహారం తినాలి. వీరు 24 గ్రాముల నూనెలు, 12 గ్రాముల నెయ్యి/వెన్న వాడొచ్చు. ⇒ 10–12 ఏళ్ల ఆడ పిల్లలు రోజుకు 2,000 కేలరీల ఆహారం తినాలి. 22 గ్రాముల నూనెలు, 11 గ్రాముల నెయ్యి/వెన్న వాడొచ్చు. ⇒ 13–15 ఏళ్ల మగ పిల్లలు రోజుకు 2,800 కేలరీల ఆహారం తినాలి. వీరు 30 గ్రాముల నూనెలు, 15 గ్రాముల నెయ్యి/వెన్న వాడొచ్చు. ⇒ 13–15 ఏళ్ల ఆడ పిల్లలు రోజుకు 2,400 కేలరీల ఆహారం తినాలి. 27 గ్రాముల నూనెలు, 13 గ్రాముల నెయ్యి/వెన్న వాడొచ్చు. ⇒ 16–18 ఏళ్ల మగ పిల్లలు రోజుకు 3,300 కేలరీల ఆహారం తినాలి. వీరు 37 గ్రాముల నూనెలు, 18 గ్రాముల నెయ్యి/వెన్న వాడొచ్చు. ⇒ 16–18 ఏళ్ల ఆడ పిల్లలు రోజుకు 2,500 కేలరీల ఆహారం తినాలి. వీరు 28 గ్రాముల నూనెలు, 13 గ్రాముల నెయ్యి వాడొచ్చు.వ్యాయామం చేసే వారికి నెయ్యితో మేలు! నెయ్యి మన శరీరంలో ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది. మెదడును శక్తిమంతం చేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుంది. వాతాన్ని, పైత్యాన్ని, కఫాన్ని సమస్థితిలో ఉంచుతుంది. చర్మానికి కాంతినిస్తుంది. లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. నేతిలోని బుటిరేట్ జఠరాగ్నిని ప్రజ్వలింపజేస్తుంది. విష దోషాల్ని, పేగుల్లో పుళ్లు, వాపుల్ని, గడ్డల్ని నివారిస్తుంది. నెయ్యి తినే అలవాటున్న వారిలో పేగు కేన్సర్ తక్కువ. భారతీయ గోసంతతి విదేశీ గోసంతతి కన్నా భిన్నమైనది. మన ఆవుల వెన్నలో అపకారక ఎల్డీఎల్ కొవ్వు కన్నా ఉపకారక హెచ్‌డీఎల్ కొవ్వు ఎక్కువగా ఉంటుంది. బాగా వ్యాయామం చేసే వారికి నెయ్యి మేలే చేస్తుంది. – డా. జీవీ పూర్ణచందు ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు -
రైళ్లలో చంటి పిల్లల ఆహారం
♦ యుద్ధప్రాతిపదికన ప్రారంభమైన ‘జననీ సేవ’ ♦ తొలి ప్రయత్నంగా 53 స్టేషన్లు, 32 రైళ్లలో అందుబాటులోకి సాక్షి, హైదరాబాద్: చంటి పిల్లలతో ప్రయాణించే వారికి శుభవార్త. ‘జననీ సేవ’ పేరుతో రైళ్లలో పిల్లల ఆహారం అందించేలా రైల్వేశాఖ కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇక నుంచి అన్ని రైల్వే స్టేషన్లు, దూరప్రాంతాలకు ప్రయాణించే రైళ్లలో వేడి పాలు, వేడి నీళ్లు, సెరిలాక్, ఫ్యారెక్స్ వంటివి అందుబాటు లో ఉంటాయి. తొలి ప్రయత్నంగా 53 ప్రధాన రైల్వే స్టేషన్లు, 32 ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రారంభించారు. రైల్వే స్టేషన్లలో పాలు, టీ విక్రయించే కౌంటర్లలోనే వీటికి అనుమతించా రు. నిర్ధారిత రుసుము తీసుకుని అక్కడ వీటిని అందిస్తారు. రైళ్లలో సిబ్బందికి చెబితే సీటు వద్దకే తెచ్చిస్తారు. త్వరలో మరిన్ని స్టేషన్లు, రైళ్లలో కూడా ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్త ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించటంతో వారు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ‘జనని సేవ’ అందించే స్టేషన్లు ఇవే... సికింద్రాబాద్ డివిజన్: సికింద్రాబాద్, నాం పల్లి, కాజేపేట, వరంగల్,ఖమ్మం,వికారాబాద్ హైదరాబాద్ డివిజన్: కాచిగూడ, గద్వాల, మహబూబ్‌నగర్, కామారెడ్డి, నిజామాబాద్, కర్నూలు విజయవాడ డివిజన్: విజయవాడ, గూడురు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, ఏలూరు, నిడదవోలు, రాజమండ్రి, అనకాపల్లి, గుడివాడ, తణుకు, భీమవరం, తుని, నర్సాపూర్ గుంతకల్ డివిజన్: తిరుపతి, రేణిగుంట, కడప, గుత్తి, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూర్, యాద్గిర్, అనంతపురం, ధర్మవరం, పాకాల గుంటూరు డివిజన్: నంద్యాల, దిగువమెట్ట, గుంటూరు, నల్గొండ, నడికుడి, కంభం, మార్కాపురం, మిర్యాలగూడ నాందెడ్ డివిజన్: నాందెడ్, పూర్ణ, పర్భణి, జాల్నా, ఔరంగాబాద్, నాగర్సోల్, ముద్ఖేడ్. ఈ రైళ్లలో కూడా... సికింద్రాబాద్-దానాపూర్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-తిరువనంతపురం శబరి ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, తిరుపతి-హజ్రత్‌నిజాముద్దీన్ ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-బికనీర్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ దక్షిణ్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్, విజయవాడ-చెన్నై పినాకిని ఎక్స్‌ప్రెస్, విజయవాడ-విశాఖపట్టణం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, నాందేడ్-అమృత్సర్ నాందెడ్ ఎక్స్‌ప్రెస్, నాందెడ్-ముంబై సిటీ తపోవన్ ఎక్స్‌ప్రెస్, పూర్ణ-పాట్నా పూర్ణ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-ముంబై దురంతో ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-న్యూఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్.