
ప్రాణం తీసిన అతి వేగం
● స్నేహితులను కలిసేందుకు వెళ్తుండగా..● అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి కారు బోల్తా● యువకుడు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
కొండపాక(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కొండపాక మండలంలోని మర్పడ్గ శివారులో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. త్రీ టౌన్ పోలీసుల కథనం మేరకు.. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గండివేటు గ్రామానికి చెందిన నామాల అనిల్ (24) హైదరాబాద్‌లోని బోడుప్పల్ ఉంటూ హోటల్‌లో పని చేస్తున్నాడు. బాన్సువాడ మండలంలోని దేశాయిపేటకు చెందిన సాయిబాబ(24) హైదరాబాద్‌లోనే ఉంటూ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అనిల్, సాయిబాబ ఇద్దరూ స్నేహితులు కాగా గతంలో వీరు సిద్దిపేటలోని బీజేఆర్ చౌరస్తాలో గల ఓ హోటల్‌లో పని చేశారు. ఆ సమయంలో వీరికి అక్కడ కొందరు స్నేహితులు అయ్యారు. వారిని చూసేందుకు ఆదివారం రాత్రి బోడుప్పల్ నుంచి కారులో అనిల్, సాయిబాబ బయలు దేరారు. రాజీవ్ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా రుసుం తప్పించుకోవడానికి మర్పడ్గ మీదుగా సిద్దిపేటకు వెళ్తున్నారు. మర్పడ్గ శివారులో కారు అతి వేగంగా వెళ్తూ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అనిల్ తలకు తీవ్ర గాయాలై కారులోనే ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. సాయిబాబకు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న వారు చూసి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి ఇద్దరినీ సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి అంజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు.
లారీని ఢీకొని వ్యక్తి..
సంగారెడ్డి : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన అకోలా నాందేడ్ రహదారిపై శివ్వంపేట శివారులో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పు ల్కల్ ఎస్‌ఐ క్రాంతి కుమార్ పాటిల్ కథనం మేరకు.. ఓ లారీ సంగారెడ్డి వైపు నుంచి జోగిపేట వైపు వెళుంది. అలాగే అల్లాదుర్గం మండలం చేవెళ్ల గ్రామానికి చెందిన జర్నయ్య (43) బైక్‌పై జోగిపేట వైపే వెళ్తున్నాడు. ముందు వెళ్తున్న లారీని ఓవర్ టెక్ చేసే క్రమంలో కుడి వైపు ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు పవన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
టిప్పర్ ఢీకొని వ్యక్తి
రామచంద్రాపురం(పటాన్‌చెరు): టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. శేరిలింగంపల్లి పరిధిలోని నేతాజీనగర్‌కు చెందిన ప్రభాకర్(55) క్యాటరింగ్ వ్యాపారం చేస్తున్నాడు. సోమవారం బెక్‌పై తెల్లాపూర్ నుంచి కొల్లూరు వైపు వెళ్తున్నాడు. రాజ్ పుష్ప సర్కిల్ వద్దకు రాగానే టిప్పర్ వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడంతో ప్రభాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రాణం తీసిన అతి వేగం