
మొగులు..
ఈ ఫొటోలో కనిపిస్తుంది దుబ్బాకకు చెందిన కౌలు రైతు మల్లారెడ్డి. యాసంగిలో వేసిన 3 ఎకరాల వరి పంట ఇంకో 15 రోజులైతే కోతకొచ్చేది. ఆకాశంలో మబ్బులు అవుతుండటంతో భయంతో వరి గొలుసు ఎర్రబడక ముందే కోయించాడు. వర్షం పడితే ఇత్తు చేతికి రాదు ఉన్న పంటనన్నా చేతికొస్తే చాలనుకొని పచ్చిగా ఉన్నా వరిని కోశాడు. ఇది ఈ ఒక్క రైతు మల్లారెడ్డిదే పరిస్థితే కాదు.. జిల్లాలోని చాలా మంది రైతులది ఇదే పరిస్థితి. మొగులు గుబులుతో నష్టం అయినా సరే పంటనన్నా కాపాడుకోవాలనే పచ్చి వరిని కోయిస్తున్నారు.
దుబ్బాక : ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్న వేళ రైతుల గుండెల్లో గుబులు పుడుతుంది. ఏ క్షణాన గాలి దుమారం వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం రెక్కలు ముక్కలు జేసుకొని.. పుట్టెడు పెట్టుబడులు పెట్టి కండ్లళ్ల ఒత్తులు వేసుకొని యాసంగిలో పంటలు కాపాడుకుంటూ వస్తున్న రైతులకు వాన మొగులు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. వరి పంటలు చేతికొచ్చే దశలో వారం రోజులుగా ఆకాశంలో మబ్బులు రైతులను పరేషాన్ చేస్తున్నాయి. 20 రోజుల కిందట వడగండ్ల వానలు పడటంతో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మళ్లీ గాలి దుమారం, వడగండ్ల వానలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలతోపాటు వాతావరణంలో మార్పులు రావడంతో రైతులు పచ్చి వరి పంట చేలనే కోస్తున్నారు.
20 శాతంకు పైగా నష్టమైనా..
వర్షాలు పడే సూచనలు ఉండడంతోపాటు వారం రోజులుగా చినుకులు కూడా పడుతుండటంతో రైతులు భయంతో 70 శాతం కూడా పూర్తి కాని వరి పంటలను కోయించుకుంటున్నారు. భూమి ఆరక దిగబడుతుండటంతో ఖర్చు ఎక్కువైనా చైన్ మిషన్‌లను పెట్టి కోయిస్తున్నారు. సుమారుగా 20 శాతంకు పైగా గింజలు తాలుపోయి నష్టం జరిగే అవకాశాలు ఉంది. జిల్లాలో ఈ యాసంగిలో 3.53 లక్షల ఎకరాల్లో వరి పంటలు వేయగా చాలా వరకు నీరందక పంటలు ఎండిపోయాయి. గతంలో కురిసిన వడగండ్ల వర్షంతో కొంత వరి పంటలకు నష్టం వాటిల్లింది. తీరా మళ్లీ ఆకాశంలో మార్పులతో పూర్తిగా కాని చేలనే కోస్తుండటంతో చాలా నష్టం వాటిల్లేటట్లు కనిపిస్తుంది.

మొగులు..

మొగులు..