పాము తెచ్చిన తంటా.. | - | Sakshi
Sakshi News home page

పాము తెచ్చిన తంటా..

Published Fri, Apr 18 2025 5:37 AM | Last Updated on Fri, Apr 18 2025 7:43 AM

పాము

పాము తెచ్చిన తంటా..

నాలుగు గ్రామాలకు నిలిచిన కరెంట్‌

కౌడిపల్లి(నర్సాపూర్‌): ఓ పాము సబ్‌స్టేషన్‌లోకి దూరింది. అంతటితో ఆగకుండా స్తంభాలపై నుంచి తీగలపైకి ఎక్కింది. విద్యుత్‌షాక్‌కు గురై చనిపోయింది. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో సబ్‌స్టేషన్‌లోని సీటీ ట్రాన్స్‌ఫార్మర్‌ ఒక్కసారిగా పేలింది. దీంతో కౌడిపల్లి 132/11కేవీ సబ్‌స్టేషన్‌ పరిధిలోని కౌడిపల్లి, దేవులపల్లి, మహమ్మద్‌నగర్‌, ధర్మసాగర్‌ గ్రామాలకు కరెంట్‌ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న నర్సాపూర్‌ ఏడీ రమణారెడ్డి, ఏఈ సాయికుమార్‌ విద్యుత్‌ సిబ్బంది పరిశీలించి రాత్రి వరకు మరమ్మతు చర్యలు చేపట్టారు.

100 ట్రిప్పుల ఇసుక సీజ్‌

చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని వేచరేణి శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 100 ట్రాక్టర్‌ ట్రిప్పుల ఇసుకను సీజ్‌ చేసినట్లు తహసీల్దార్‌ సమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ గురువారం తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. వేచరేణి శివారు వాగులో నుంచి కొందరు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించి ఒక చోట డంప్‌ చేస్తున్నట్లు తెలిపారు. పక్కా సమాచారం మేరకు వెళ్లి ఇసుక సీజ్‌ చేశామన్నారు. ఆయన వెంట ఆర్‌ఐలు రాజేందర్‌ రెడ్డి, ఐలయ్య, స్థానిక రైతులు ఉన్నారు.

విషపు ఆహారం తిని..

మూడు ఆవులు మృతి

హత్నూర (సంగారెడ్డి): విష ఆహారం తిని మూడు పాడి ఆవులు మృతి చెందిన ఘటన హత్నూర మండలం గుండ్ల మాచునూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన మన్నె సత్తయ్య పాడి గేదెలు, ఆవులను మేపుతూ జీవిస్తున్నాడు. గ్రామ శివారులో గల చెరువు సమీపంలో ఇటీవల సినీ ఇండస్ట్రీ వాళ్లు సినిమా షూటింగ్‌లో భాగంగా అమ్మవారికి అన్నం రతి పోసి నైవేద్యం సమర్పించే సన్నివేశాన్ని చిత్రీకరించారు. సుమారు 3 క్వింటాళ్ల బియ్యంతో వండిన అన్నం వదిలేసి వెళ్లిపోయారు. వారం రోజుల కిందట వండిన అన్నం కావడంతో పూర్తిగా కుళ్లిపోయింది. ఆ ఆహారాన్ని బుధవారం సాయంత్రం మూడు ఆవులు తిని మృతి చెందాయి. సుమారు రూ.3 లక్షల వరకు నష్టపోయినట్లు బాధితుడు సత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

దొంగతనం కేసులో జైలు

మర్కూక్‌(గజ్వేల్‌): దొంగతనం కేసులో కోర్టు ఇద్దరికి జైలు శిక్షతోపాటు జరిమానా విధించినట్లు మర్కూక్‌ ఎస్‌ఐ దామోదర్‌ తెలిపారు. 2017 సెప్టెంబర్‌లో మర్కూక్‌ గ్రామానికి చెందిన తుప్పటి కొమురవ్వ వ్యవసాయ క్షేత్రం నుంచి ఇంటికి వెళ్తుంది. సంగారెడ్డి పట్టణానికి చెందిన అందనాగారం సాయిగౌడ్‌, బెండి రజనీకాంత్‌ ద్విచక్రవాహనంపై వచ్చి కొమురవ్వ మెడలో నుంచి రూ.60 వేలు విలువ చేసే బంగారు గొలుసును అపహరించారు. వెంటనే మర్కూక్‌ పోలీసులో ఫిర్యాదు చేశారు. గురువారం ఇద్దరు నిందితులను పట్టుకొని గజ్వేల్‌ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ప్రియాంక ఎదుట హాజరు పర్చగా సంవత్సరం జైలుతోపాటు రూ.10వేలు జరిమానా విధించినట్లు తెలిపారు.

బంగారు ఆభరణాలు చోరీ

రామాయంపేట(మెదక్‌): తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన రామాయంపేటలోని బీసీ కాలనీలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ బాల్‌రాజ్‌ కథనం మేరకు.. కాలనీలో నివాసం ఉంటున్న చర్చి ఫాదర్‌ మాసాయిపేట దయానంద్‌ 14న ఇంటికి తాళం వేసి భార్యతో కలిసి ఊరికి వెళ్లాడు. 15న ఇంటి పక్కనే ఉంటున్న వ్యక్తి ఫోన్‌ చేసి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయని చెప్పాడు. దయానంద్‌ వెంటనే వచ్చి చూడగా ఇంట్లో బీరువాలో దాచి ఉంచిన మూడున్నర తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి ఎత్తుకెళ్లినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల ఆకస్మిక తనిఖీలు

మెదక్‌ మున్సిపాలిటీ: మెదక్‌ పట్టణంలో గురువారం రాత్రి పలు టీస్టాల్స్‌, పాన్‌షాపులు, హోటళ్లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణ సీఐ నాగరాజు మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌ ఆదేశాల మేరకు మెదక్‌ డీఎస్పీ ప్రసన్నకుమార్‌ సూచనలతో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. టీ స్టాల్స్‌ పాన్‌ షాపులు, హోటళ్లలో గంజాయి అమ్ముతున్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో ఈ తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. డాగ్‌ స్క్వాడ్‌, క్యూఆర్టీ టీమ్‌తో తనిఖీలు చేశామన్నారు. ఎస్‌ఐ అమర్‌, ఆర్‌ఎస్‌ఐ భవానీ కుమార్‌ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

పాము తెచ్చిన తంటా..1
1/1

పాము తెచ్చిన తంటా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement