
ఇద్దరి ప్రాణం తీసిన ఈత సరదా
దుబ్బాకరూరల్: ఈతకు వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని చీకోడ్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ గంగరాజ్ కథనం మేరకు.. తౌడ ఏగొండ, భూదవ్వ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు బాబు(25) గ్రామ శివారులో ఉన్న చెరువులోకి స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు. ఈత కొడుతూ చెరువులోకి చాలా దూరం వెళ్లి నీటిలో మునిగి పోయాడు. గమనించిన స్నేహితులు చెరువులో నుంచి బయటకు తీసుకొచ్చి చూడగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఏగొండ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చేతికొచ్చిన కొడుకు చెరువులో మునిగి మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
మద్యం మత్తులో వెళ్లి..
కొమురవెల్లి(సిద్దిపేట): మద్యం మత్తులో ఈత కొట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మంగళవారం ఎస్‌ఐ రాజు కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన గొల్లపల్లి కనకయ్య(50) కుటుబంతో కలిసి హైదరాబాద్‌లో పాత ఇసుప సామగ్రి వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల పెద్ద కుమారుడుకి కొడుకు పుట్టడంతో బారసాల నిర్వహించేందుకు గ్రామానికి వచ్చారు. ఆదివారం బారసాల కార్యక్రమాన్ని పూర్తి చేశారు. మంగళవారం కుటుంబంతో కలిసి మద్యం సేవించారు. మధ్యాహ్న సమయంలో స్నానం చేసేందుకు గ్రామ శివారులో గల పెద్ద బావి వద్దకు వెళ్లాడు. నీటికిలోకి దూకిన కనకయ్య ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో కుమారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య యాదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
దుబ్బాకలో యువకుడు, కొమురవెల్లిలో వ్యక్తి
ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం

ఇద్దరి ప్రాణం తీసిన ఈత సరదా