
అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని..
హుస్నాబాద్‌రూరల్: జిల్లెలగడ్డ బావిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన మిస్టరీని పోలీసులు ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. ములుగు జిల్లా వెంకటాపూర్‌కు చెందిన సాయి ప్రకాశ్ (29) చేయూత స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్నాడు. చిన్నమ్మ ఓ కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధంను గుర్తించిన సాయి ప్రకాశ్ కానిస్టేబుల్‌పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతడు సస్పెండ్ అయ్యాడు. ఆరు నెలల తర్వాత విధుల్లో చేరిన కానిస్టేబుల్ ప్రియురాలితో కలిసి అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్న సాయి ప్రకాశ్‌ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. కానిస్టేబుల్ ఓ సుఫారీ గ్యాంగ్‌ను మాట్లాడి సాయిని హత్య చేసే పనిని అప్పగించాడు. 15న వెంకటాపూర్ నుంచి సాయి ప్రకాశ్ కారులో బంధువులను హన్మకొండ హాస్పిటల్‌కు తీసుకొచ్చాడు. రాత్రి తిరుగు ప్రయాణంలో ప్రకాశ్ కారును రెండు ఆటోల్లో సుఫారీ గ్యాంగ్ వెంబడించింది. ములుగు రోడ్డులో కిడ్నాప్ చేసి కారులో హసనుపర్తి వద్దనే హత్య చేశారు. సాయి కారులోనే హన్మకొండ జిల్లా సరిహద్దు దాటి హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డలో రాత్రి ఒక వ్యవసాయ బావిలో మృతదేహం పడేసి వెళ్లిపోయారు. 17న సాయంత్రం రైతు తన బావిలో మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి హుస్నాబాద్ ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు జిల్లెలగడ్డలోని ఇటుక బట్టీల దగ్గర సీసీ కెమెరాలో ఫుటేజీను పరిశీలించారు. రాత్రి కారు వచ్చి వెళ్లిన దృశ్యాల ఆధారంతో పోలీసులు కేసును ఛేదించారు. కిడ్నాపు చేసి హత్య చేసిన సుఫారీ గ్యాంగ్‌ను హన్మకొండ పోలీసులు అరెస్టు చేసినట్లు హుస్నాబాద్ పోలీసులు పేర్కొన్నారు.
యువకుడి దారుణ హత్య
మృతుడు ములుగు జిల్లా వాసి
వరంగల్‌లో కిడ్నాప్ చేసి జిల్లెలగడ్డలో బావిలో పడేసిన వైనం
గుర్తు తెలియని మృతదేహం
కేసును ఛేదించిన పోలీసులు