
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో ఇంగ్లండ్ ప్రయాణం ముగిసిపోయింది. అఫ్గనిస్తాన్(Afghanistan vs England)తో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో బట్లర్ బృందానికి చేదు అనుభవమే మిగిలింది. ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో అఫ్గన్ గెలుపొంది ఇంగ్లండ్‌ను టోర్నమెంట్ నుంచి బయటకు పంపింది. తమదైన రోజున ఎంతటి పటిష్ట జట్టునైనా ఓడిస్తామని హష్మతుల్లా బృందం మరోసారి నిరూపించింది.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(Jos Buttler) తీవ్ర నిరాశకు గురికాగా.. అఫ్గనిస్తాన్ సారథి హష్మతుల్లా పట్టరాని సంతోషంలో మునిగిపోయాడు. ఇక ఓటమిపై స్పందించిన బట్లర్.. తామే చేజేతులా కీలక మ్యాచ్‌ను చేజార్చుకున్నామని విచారం వ్యక్తం చేశాడు. గెలిచే మ్యాచ్‌లోనూ ఓడిపోవడం కంటే బాధ మరొకటి ఉండదని అన్నాడు.
రూట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు
‘‘టోర్నమెంట్ నుంచి ఇంత త్వరగా నిష్క్రమించడం నిరాశను మిగిల్చింది. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో గెలిచేందుకు మాకు అన్ని అవకాశాలు ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాం. ఈరోజు రూట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి పది ఓవర్లలో అంతా తారుమారైంది.
క్రెడిట్ తనకే
ఏదేమైనా ఇబ్రహీం జద్రాన్ అత్యద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతడికి క్రెడిట్ ఇవ్వాలి. ఇక దురదృష్టవశాత్తూ మార్క్ వుడ్ మోకాలికి గాయమైంది. అయినా సరే తను బౌలింగ్ చేయడం ప్రశంసనీయం. డెత్ ఓవర్లలో ఇలా కీలక బౌలర్ గాయపడటం తీవ్ర ప్రభావం చూపింది.
ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లు ఒకడిగా ఉన్నా నా నుంచి ఇలాంటి ప్రదర్శన ఎంతమాత్రం సరికాదు. అయినా ఈ ఉద్వేగ సమయంలో నేను ఎలాంటి నిర్ణయాలు(రిటైర్మెంట్) తీసుకోను’’ అని బట్లర్ పేర్కొన్నాడు.
ఇబ్రహీం జద్రాన్ ప్రతిభావంతుడైన ఆటగాడు
ఇక అఫ్గనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది మాట్లాడుతూ.. ‘‘ఇది సమిష్టి విజయం. ఈ గెలుపుతో మా దేశం మొత్తం సంతోషంలో మునిగిపోయింది. 2023లో ఇంగ్లండ్‌ను తొలిసారిగా మేము ఓడించాం. అప్పటి నుంచి రోజురోజుకు మరింతగా మా ఆటకు మెరుగులు దిద్దుకుని.. ఇప్పుడు మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేశాం.
నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో మాదే పైచేయి కావడం ఆనందంగా ఉంది. ఇబ్రహీం జద్రాన్ ప్రతిభావంతుడైన ఆటగాడు. ఒత్తిడిలోనూ అతడు అద్బుతంగా ఆడాడు. నేను చూసిన వన్డే ఇన్నింగ్స్‌లో ఇదొక అత్యుత్తమ ప్రదర్శన అని చెప్పగలను.
అజ్మత్ కూడా బాగా ఆడాడు. జట్టులో నైపుణ్యాలు గల సీనియర్లతో పాటు జూనియర్లుకూడా ఉండటం మా అదృష్టం. ప్రతి ఒక్కరికి తమ పాత్ర ఏమిటో తెలుసు’’ అని తెలిపాడు.
కాగా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్-బి లో ఉన్న అఫ్గనిస్తాన్- ఇంగ్లండ్ మధ్య బుధవారం వన్డే మ్యాచ్ జరిగింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన అఫ్గన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్(177) భారీ శతకంతో దుమ్ములేపగా.. హష్మతుల్లా(40), అజ్మతుల్లా(41), మహ్మద్ నబీ(40) రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో అఫ్గన్ 325 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.
ఇక లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 317 పరుగులకే పరిమితమైంది. జో రూట్ శతకం(120) సెంచరీ చేయగా.. మిగతా వాళ్లలో ఒక్కరు కూడా కనీసం నలభై పరుగుల మార్కు అందుకోలేదు దీంతో ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లండ్‌కు పరాజయం తప్పలేదు. ఇక ఈ ఓటమితో టోర్నీ నుంచి బట్లర్ బృందం నిష్క్రమించింది. ఈ గ్రూపు నుంచి సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ రేసులో ఫేవరెట్లుగా ఉండగా.. అఫ్గనిస్తాన్ తానూ పోటీలో ఉన్నానంటూ ముందుకు వచ్చింది.
చదవండి: Champions Trophy: టీమిండియాకు గుడ్ న్యూస్.. అతడు వచ్చేశాడు