
ఇంగ్లండ్ క్రికెట్ జట్టుపై ఆ దేశ మాజీ బ్యాటర్ మార్క్ బుచర్(Mark Butcher) ఆగ్రహం వ్యక్తం చేశాడు. గర్వ తలకెక్కితే ఇలాంటి చేదు అనుభవాలే చూడాల్సి వస్తుందంటూ ఘాటు విమర్శలు చేశాడు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆటపై కాస్త దృష్టి పెట్టాలంటూ హితవు పలికాడు. కాగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023(ICC ODI World Cup)లో పేలవ ప్రదర్శన కనబరిచిన ఇంగ్లండ్.. తాజాగా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లోనూ తీవ్రంగా నిరాశపరిచింది.
సెమీస్ కూడా చేరకుండానే
గ్రూప్-‘బి’లో భాగంగా ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్ జట్ల చేతిలో ఓడి కనీసం సెమీస్ కూడా చేరకుండానే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఈ రెండు మ్యాచ్‌లలో ఏమాత్రం కష్టపడినా ఇంగ్లండ్ గెలిచేదే. ముఖ్యంగా అఫ్గన్‌తో మ్యాచ్‌లో జో రూట్(120)కు ఒక్కరు సహకారం అందించినా బట్లర్ బృందం గట్టెక్కేదే. కానీ ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో ఓడి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.
ఇక ఈ వన్డే టోర్నీకి ముందు భారత్‌లో పర్యటించిన ఇంగ్లండ్ జట్టు.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 4-1తో ఓడింది. అదే విధంగా సిరీస్‌లో రోహిత్ సేన చేతిలో వన్డే 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది.
ఈ నేపథ్యంలో నాడు ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ మాట్లాడుతూ.. వైట్‌వాష్ పరాజయాన్ని తాము లెక్కచేయమని.. చాంపియన్స్ ట్రోఫీ గెలవడమే తమ లక్ష్యమని పేర్కొన్నాడు. అయితే, అది జరగదని ఇప్పటికే తేలిపోయింది.
గర్వం తలకెక్కింది
ఈ నేపథ్యంలో మార్క్ బుచర్ విజ్డన్‌తో మాట్లాడుతూ.. బట్లర్ బృందం తీరుపై మండిపడ్డాడు. ఆటగాళ్ల గర్వం, నిర్లక్ష్య ధోరణి వల్లే... ప్రతి ఒక్కరు ఇంగ్లండ్ జట్టు ఓడిపోవాలని కోరుకున్నారని.. ఇకనైనా దూకుడు స్వభావాన్ని విడిచిపెట్టాలని ఆటగాళ్లకు సూచించాడు. ‘‘చాలా మంది అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడిపోవాలని ఎందుకు కోరుకున్నారో నాకు తెలుసు.
ఇంగ్లండ్ జట్టుకు గర్వం తలకెక్కింది. వన్డే ఫార్మాట్ అంటే బొత్తిగా లెక్కలేదు. వన్డే వరల్డ్‌కప్(2019) గెలవడానికి ఎంత కష్టపడ్డారో మరచిపోయారు. గెలిచిన తర్వాత ఇకపై ఆడటం అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అహంభావం పెరిగిపోయింది. దాని ఫలితంగానే ఈ చేదు అనుభవాలు.
ప్రతి ఒక్కరు ఇంగ్లండ్ ఓడిపోవాలనే కోరుకున్నారు
మైదానంలో ఉన్న అఫ్గనిస్తాన్, పాకిస్తాన్ జట్ల అభిమానులే కాదు.. ప్రతి ఒక్కరు ఇంగ్లండ్ ఓడిపోవాలని కోరుకుంది ఇందుకే. ప్రతిసారీ ఆటతో అలరిస్తామని చెబితే సరిపోదు. మ్యాచ్‌లు కూడా గెలవాలి’’ అంటూ మార్క్ బుచర్ బట్లర్ బృందానికి చురకలు అంటించాడు.
కాగా వన్డే వరల్డ్‌కప్-2023 నుంచి ఇప్పటి వరకు పదహారు వన్డేలు ఆడిన ఇంగ్లండ్ పన్నెండింట ఓడిపోవడం గమనార్హం. ఇక బ్రెండన్ మెకల్లమ్ వన్డే, టీ20 జట్ల హెడ్‌కోచ్‌గా వచ్చిన తర్వాత భారత్ చేతిలో క్లీన్‌స్వీప్, చాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశలోనే నిష్క్రమించడంతో విమర్శలు తారస్థాయికి చేరాడు.
చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఇంగ్లండ్ జట్టు
ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జోఫ్రా ఆర్చర్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రెహాన్ అహ్మద్, సకీబ్ మహమూద్, టామ్ బాంటన్, గస్ అట్కిన్సన్.
చదవండి: CT 2025: ఇక్కడ ఓడిపోయాం.. అక్కడ మాత్రం రాణిస్తాం: పాక్ కెప్టెన్