
PC: DC
ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen) ప్రయాణం విజయవంతగా సాగుతోంది. అతడి మార్గదర్శనంలో.. అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఢిల్లీ సరికొత్త ఉత్సాహంతో విజయపరంపర కొనసాగిస్తోంది. ఐపీఎల్-2025 (IPL 2025)లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
ఇక తమ ఏడో మ్యాచ్‌లో భాగంగా ఢిల్లీ శనివారం మధ్యాహ్నం నాటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో పోటీకి దిగింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుండగా.. ఒకరోజు ముందే అక్కడికి చేరుకున్న అక్షర్ సేన నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది.
సోదరా.. నీకు మెంటార్‌కు అర్థం తెలుసా?!.
ఈ సందర్భంగా గుజరాత్ టైటాన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు సరదాగా ముచ్చటించుకున్నారు. ఈ క్రమంలో టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill).. ఢిల్లీ మెంటార్ పీటర్సన్ దగ్గరకు వచ్చి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు.
పరస్పరం క్షేమ, సమాచారాలు అడిగితెలుసుకున్న తర్వాత.. పీటర్సన్.. ‘‘సోదరా.. నీకు మెంటార్‌కు అర్థం తెలుసా?!.. ఇక్కడ ఉన్న వాళ్లలో ఒక్కరికి మెంటార్ అంటే తెలియనే తెలియదు’’ అని గిల్‌తో అన్నాడు.
రెండు వారాల పాటు మాల్దీవుల పర్యటన
వీరిద్దరి సంభాషణ మధ్యలో జోక్యం చేసుకున్న ఢిల్లీ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. పీటర్సన్‌కు ఊహించని షాకిచ్చాడు. ‘‘ఎవరైతే సీజన్ మధ్యలోనే రెండు వారాల పాటు మాల్దీవుల పర్యటనకు వెళ్తారో.. వారే మెంటార్’’ అంటూ రాహుల్ పీటర్సన్‌ను టీజ్ చేశాడు. దీంతో పీటర్సన్ బిక్కముఖం వేసుకుని చూసాడు.
నా దోస్తులంతా ఇంతే
ఇందుకు.. ‘‘నా స్నేహితులంతా ఇంతే.. విషపూరితమైన వాళ్లు.. లక్ష్యం లేని వాళ్లు. ఎప్పుడూ ప్రతికూలంగానే మాట్లాడతారు.. పరుషంగా ఉంటారు.. నాకు కొత్త స్నేహితులు కావాలి.. కానీ అంత త్వరగా, సులువుగా దొరకరే..’’ అన్న పంక్తులతో సాగే BoyWithUke పాటను ఢిల్లీ అడ్మిన్ పీటర్సన్ ఇన్నర్ వాయిస్‌లా జతచేశారు.
ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘‘థాంక్యూ కేఎల్.. మెంటార్ అంటే సరైన అర్థం ఏమిటో ఇప్పుడే చెప్పావు’’ అన్నట్లు క్యాప్షన్ ఇచ్చారు. కాగా కెవిన్ పీటర్సన్ 2009లో ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు.
వ్యక్తిగత సెలవు మీద
ఆరంభంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన కెవిన్ పీటర్సన్.. సారథిగానూ వ్యవహరించాడు. ఆ తర్వాత ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కి ప్రాతినిథ్యం వహించిన పీటర్సన్.. 17 మ్యాచ్‌లలో కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. అదే విధంగా రైజింగ్ పూణె సూపర్‌జెయింట్స్‌కు కూడా ఆడాడు.
2016లో చివరగా ఐపీఎల్ ఆడిన 44 ఏళ్ల పీటర్సన్ మొత్తంగా క్యాష్ రిచ్ లీగ్‌లో 36 మ్యాచ్‌లు ఆడి 1001 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 2025లో మెంటార్ అవతారంలో తిరిగి ఢిల్లీ ఫ్రాంఛైజీతో జట్టు కట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ హేమంగ్ బదాని, బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్, అసిస్టెంట్ కోచ్ మాథ్యూ మాట్‌లతో కలిసి పీటర్సన్ పనిచేస్తున్నాడు.
ఇక ఏప్రిల్ 5న చెన్నై సూపర్ కింగ్స్‌పై ఢిల్లీ గెలుపొందిన తర్వాత.. వ్యక్తిగత సెలవు మీద పీటర్సన్ మాల్దీవుల పర్యటనకు వెళ్లాడు. ఫలితంగా ఏప్రిల్ 10న ఆర్సీబీతో మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండలేకపోయాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కేఎల్ రాహుల్ పీటర్సన్‌ను ట్రోల్ చేయడం విశేషం.
చదవండి: ఒక్కరికీ కామన్ సెన్స్ లేదు.. ఇంత చెత్తగా ఆడతారా?: సెహ్వాగ్ ఫైర్
Thanks KL, now we know what a mentor does 😂 pic.twitter.com/JXWSVJBfQS
— Delhi Capitals (@DelhiCapitals) April 19, 2025